మాంసం ధరలకు రెక్కలు
సాక్షి, సిటీబ్యూరో : దసరా పండగ ఆదివారమా..? సోమవారమా..? అన్న మీమాంస వల్ల నగర మార్కెట్లో మటన్, చికెన్ వ్యాపారాల్లో జోరు తగ్గింది. అయితే... పండగ గిరాకీని సొమ్ము చేసుకునేందుకు వ్యాపారులు కూడబలుక్కొని ధరలు పెంచేశారు. దీంతో మటన్, చికెన్ ధరల్లో రూ.10-50ల వరకు పెరుగుదల కన్పించింది. కొందరు ఆదివారమే దసరా పండుగ చేసుకోవడంతో మటన్, చికెన్ షాపుల వద్ద కాస్త రద్దీ కన్పించింది. పండగ ఏరోజన్నది ముఖ్యం కాదని, ఈ అవకాశం పోతే మళ్లీ ఏడాదివరకు రాదన్న ఉద్దేశంతో వ్యాపారులు ధరలు పెంచడంతో వినియోగదారులపై భారంపడింది.
నిజానికి గత వారం రోజులుగా కేజీ రూ.90లకు లభించిన చికెన్ ఆదివారం ఒక్కసారిగా రూ.100కి చేరింది. అలాగే కేజీ రూ.380 నుంచి రూ.400 ఉన్న మటన్ ధర కూడా పండగ గిరాకీతో రూ.450 నుంచి రూ.500 కి పెంచేశారు. ప్రస్తుతం లైవ్ కోడి ఫారం ధర కేజీ రూ.56 ఉండగా రిటైల్ మార్కెట్లో మాత్రం రూ.71 ప్రకారం విక్రయించారు. అదే డ్రెస్డ్ చికెన్ (స్కిన్‌తో) కేజీ రూ.100, స్కిన్ లెన్ రూ.118, బోన్ లెస్ రూ. 230ల ప్రకారం అమ్మారు. పండగ దినాలను క్యాష్ చేసుకునేందుకే మూకుమ్మడిగా ధరలు పెంచేశారని తెలుస్తోంది.
పంజగుట్ట, కూకట్పల్లి, సికింద్రాబాద్ ప్రాంతాల్లో గిరాకీని బట్టి కొందరు వ్యాపారులు క్వాలిటీ పేరుతో మటన్ కేజీకి రూ.500లు వసూలు చేశారు. ఇక బోన్‌లెస్ అయితే కేజీ రూ.600ల పైమాటే. అయితే... ఈ ధరలు నగరమంతటా ఒకేలా లేవు. డిమాండ్‌ను బట్టి ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా వ్యాపారులు ధర నిర్ణయించి సొమ్ము చేసుకున్నారు. అయితే.. సాధారణంగా ఆదివారం జరిగే వ్యాపారం తప్ప పండగ గిరాకీ ఊపు పెద్దగా కన్పించలేదని మాంసం వ్యాపారులు పెదవి విరుస్తున్నారు.