‘బడ్జెట్’ భేటీకి తెర
► లోక్సభలో 23, రాజ్యసభలో 14 బిల్లులకు ఆమోదం
►ముందస్తు బడ్జెట్; రైల్వే బడ్జెట్ విలీనం ఈ సమావేశాల్లోనే
న్యూఢిల్లీ: పలు చరిత్రాత్మక పరిణామాలకు తెరతీసిన తాజా పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు బుధవారం ముగిశాయి. బడ్జెట్ కససత్తు ముగించి నిరవధికంగా వాయిదా పడ్డాయి. వస్తు, సేవల పన్ను(జీఎస్టీ)కు సంబంధించిన 4 బిల్లుల ఆమోదంతోపాటు ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందే నిధుల కేటాయింపు కోసం బడ్జెట్ను ఒక నెల ముందుకు జరిపి ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టడం, అందులో రైల్వే బడ్జెట్ విలీనం ఈ సమావేశాల్లోని విశేషాలు. జనవరి 31న మొదలైన భేటీలు ఆ రోజు నుంచి ఫిబ్రవరి 9 వరకు, మార్చి 9 నుంచి ఏప్రిల్ 12 వరకు రెండు విడతలుగా సాగాయి. కుల్భూషణ్ యాదవ్కు పాక్ ఆర్మీ కోర్టు మరణశిక్ష విధించడాన్ని వ్యతిరేకిస్తూ ఈ సమావేశాల్లో అన్నీ పార్టీలూ ఏకతాటిపైకి వచ్చాయి.
జీఎస్టీ సహా కీలక బిల్లులకు ఆమోదం
29 రోజులు సమావేశాలు జరగ్గా, లోక్సభ 176 గంటల 39 నిమిషాలు, రాజ్యసభ 136 గంటలు పనిచేశాయి. వివిధ అంశాలపై గొడవలతో లోక్సభలో 8 గంటల 12 నిమిషాలు, రాజ్యసభలో 13 గంటల సమయం వృథా అయింది. దేశంలో అతి పెద్ద పన్ను సంస్కరణ అయిన జీఎస్టీ బిల్లులను ఉభయ సభలు ఆమోదించాయి. నోట్ల రద్దు, ప్రసూతి ప్రయోజనాల సవరణ, శత్రు ఆస్తుల స్వాధీనం, మోటారు వాహనాల సవరణ తదితర 23 బిల్లులకు లోక్సభ ఆమోదం తెలిపింది.
560 స్టార్ గుర్తు ప్రశ్నల్లో 136 ప్రశ్నలకు ప్రభుత్వం మౌఖిక సమాధానాలు ఇచ్చిందని, 158 ప్రైవేటు సభ్యుల బిల్లులను సభలో ప్రవేశపెట్టారని స్పీకర్ సుమిత్రా మహాజన్ సమావేశాల ముగింపు సందర్భంగా వెల్లడించారు. జీఎస్టీ, శత్రు ఆస్తుల స్వాధీనం తదితర 14 బిల్లులకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. వెనక బెంచీల్లో కూర్చున్నవారు ఈసారి ఉత్సాహంగా సభకార్యకలాపాల్లో పాల్గొన్నారని రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ బుధవారం ప్రశంసించారు. పార్లమెంటు చరిత్రలో ఎక్కువగా ఫలప్రదమైన సమావేశాల్లో ఇవి ఒకటని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్ కుమార్ విలేకరులతో అన్నారు.