వైదొలగుతూ విమర్శనాస్త్రాలు..
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ కేజీ డీ6 వివాదానికి సంబంధించిన ఆర్బిట్రేషన్ (మధ్యవర్తిత్వం) ట్రిబ్యునల్‌కు ఆర్బిట్రేటర్‌గా సుప్రీం కోర్టు నియమించిన ఆస్ట్రేలియా జడ్జి మైకేల్ మెక్‌హ్యూ ఆ పదవి నుంచి తప్పుకునే ముందు ప్రభుత్వంపై విమర్శలు సంధించారు. తన ప్రకటనలకు తప్పుడు భాష్యం చెప్పారని పేర్కొన్నారు. కేజీ డీ6లో గ్యాస్ ఉత్పత్తి లక్ష్యాలను చేరుకోలేకపోయినందుకుగాను 237 కోట్ల డాలర్ల వ్యయ రికవరీని ప్రభుత్వం నిరాకరించింది.
సర్కారు నిర్ణయం సరైనదేనా అని తేల్చేందుకు ఏర్పాటు చేసిన ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్‌కు మూడో ఆర్బిట్రేటర్‌గా మెక్హ్యూను ఏప్రిల్ 29న సుప్రీం కోర్టు నియమించింది. తనను సంప్రదించలేదంటూ ఈ పదవిని చేపట్టడానికి తొలుత నిరాకరించిన ఆయన కేజీ డీ6 భాగస్వాములు సంప్రదించడంతో మే 29న సుముఖత వ్యక్తంచేశారు. ఒకసారి నిరాకరించిన తర్వాత మళ్లీ ఆ పదవిని చేపట్టజాలరంటూ ప్రభుత్వం, దాని తరఫు న్యాయవాదులు వ్యాఖ్యానించడంతో... వైదొలగుతున్నానంటూ జూలై 20న మెక్‌హ్యూ ప్రకటించారు.
అంతకుముందుగానే ప్రభుత్వ లాయర్లకు లేఖ రాశారు. ‘సుప్రీం కోర్టు ప్రతిపాదనకు విముఖత వెలిబుచ్చుతూ మే 25న ఈమెయిల్ పంపించాను. దాన్ని కోర్టు ఆమోదించేంత వరకూ నేను ఉపసంహరించుకున్నట్లు భావించరాదు. ఓ సైనికాధికారి రాజీనామా చేస్తే దాన్ని ఆమోదించే వరకు రాజీనామా లేఖ ప్రభావం ఉండదు. కోర్టు నియమించిన ఆర్బిట్రేటర్ వ్యవహారం కూడా ఇలానే ఉంటుంది..’ అని మెక్‌హ్యూ వ్యాఖ్యానించారు.