మిగులు భూముల్లో.. మినీ సోలార్
గద్వాల : సోలార్ విద్యుత్ ప్రాజెక్టులకు నడిగడ్డ కేంద్రబిందువుగా మారనుంది. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులకు కేటాయించిన మిగులు భూముల్లో జెన్కో ఆధ్వర్యంలో ఒక మెగావాట్ విద్యుదుత్పత్తి సామర్థ్యంతో మినీ సోలార్ ప్రాజెక్టులను ప్రభుత్వం నిర్మించనుంది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి వచ్చిన సమాచారం మేరకు సాగునీటి శాఖ ఇంజనీర్లు జిల్లాలోని ప్రాజెక్టుల వద్ద ఉన్న మిగులు భూముల వివరాలను ప్రాజెక్టుల సీఈ ఖగేందర్‌కు పంపించారు.
ప్రాజెక్టులకు అవసరమైన భూములను మినహాయించి మిగతా భూ వివరాలతో ప్రభుత్వానికి నివేదించారు. ఈ ప్రక్రియ ముందుకు సాగితే నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంతో పాటు జిల్లాలో ఉన్న కోయిల్‌సాగర్, భీమా, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాల వద్ద జెన్కో ఆధ్వర్యంలో త్వరలోనే మినీ సోలార్ విద్యుత్ ప్రాజెక్టులు అందుబాటులోకి రానున్నాయి. ప్రభుత్వం అంచనా మేరకు మిగులు భూముల్లో వంద మెగావాట్ల సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేయనున్నారు.
గుర్తించిన భూములివే..
నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగమైన గుడ్డెందొడ్డి, ర్యాలంపాడు రిజర్వాయర్ల వద్ద ఉన్న 360 ఎకరాలు, కోయిల్‌సాగర్ వద్ద 45 ఎకరాలు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం(ఎంజీఎల్‌ఐ) వద్ద వందెకరాలు, భీమా ప్రాజెక్టు లిఫ్టుల వద్దనున్న 80 ఎకరాల్లో ప్రభుత్వ అవసరాలకు వినియోగించుకునే విధంగా నీటి పారుదలశాఖ అధికారులు ఈఎన్సీ ద్వారా ప్రభుత్వానికి నివేదికలు పంపారు. ప్రభుత్వం నుంచి జెన్కోకు చేరడమే మిగిలి ఉంది.
జూరాల ప్రాజెక్టు వద్ద చేపట్టిన ఒక మెగావాట్ సోలార్ విద్యుత్ కేంద్రం గత నాలుగేళ్లుగా విజయవంతంగా విద్యుదుత్పత్తిని కొనసాగిస్తున్నారు.
ఈ ప్రాజెక్టును ఆదర్శంగా తీసుకుని మిగతా ప్రాజెక్టుల వద్ద మినీ సోలార్ వి ద్యుత్ ప్రాజెక్టులను చేపట్టాలని నిర్ణయిం చారు. జూరాల ప్రాజెక్టు వద్ద ఇంకా 50 ఎకరాల మిగులు భూమిని గుర్తించినప్పటికీ ఇక్కడ పర్యాటక కేంద్రం ఏర్పాటుతో పాటు ప్రాజెక్టు అవసరాలకు ఉపయోగిం చుకుంటామని నివేదికలో పేర్కొన్నారు.
భూములను గుర్తించి నివేదిక పంపాం :
- ఖగేందర్, ప్రాజెక్టుల సీఈ
జిల్లాలో జూరాల, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, కల్వకుర్తి, భీమా ప్రాజెక్టుల వద్ద ఉన్న భూమిని మినీ సోలార్ ప్రాజెక్టుల అవసరాలకు వినియోగించుకునేందుకు 585 ఎకరాలను గుర్తించారు. ఈ విషయమై ప్రభుత్వానికి నివేదిక పంపించాం. జూరాల ప్రాజెక్టు వద్ద గుర్తించిన 50 ఎకరాలను పర్యాటక అవసరాలకు మినహాయించాం.