వాళ్లు.. తప్పుడు రేప్ కేసులు పెడతారు!
పశ్చిమబెంగాల్లో ఓ మంత్రి వామపక్షాల మహిళా కార్యకర్తలపై దారుణమైన వ్యాఖ్యలు చేశారు. ''వాళ్లు తరచు తమ జాకెట్లు చించుకుని, అవతలి వాళ్ల మీద తప్పుడు రేప్ కేసులు పెడతారు" అన్నారు. ఈ వ్యాఖ్యలు చేసిన స్వపన్ దేవ్నాథ్ ... మమత సర్కారులో చిన్న పరిశ్రమలు, వస్త్రశాఖ సహాయమంత్రిగా పనిచేస్తున్నారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో ఆయన సీనియర్ నాయకుడు. బర్ద్వాన్ ప్రాంతంలో జరిగిన ఓ ర్యాలీలో మాట్లాడుతూ, ''ప్రమోషన్ కోసం నిజాయితీ చూపించుకోడానికి సొంత కొడుకును కూడా అరెస్టు చేసే పోలీసులుంటారు. అలాగే, సీపీఎం మహిళా విభాగం నాయకులు చాలామంది అవతలి వాళ్ల మీద కేసులు పెట్టడానికి తమ దుస్తులు తామే చించుకుంటారు'' అన్నారు. ఇంట్లో భర్తతో గొడవపడి దెబ్బలు తిన్నా కూడా.. బయటికొచ్చి తృణమూల్ వాళ్ల మీద ఆ కేసులు పెడతారని చెప్పారు.
ఇటీవలి కాలంలో అధికార పార్టీ నాయకుల మీద కేసులు పెట్టడానికి ప్రతిపక్షాలు వదంతులు ఎలా వ్యాపింపజేస్తున్నాయని చెప్పడానికి ఆయనీ ఉదాహరణలు చూపించారు.
అయితే మంత్రి వ్యాఖ్యలను సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కరత్ ఖండించారు. తృణమూల్ కాంగ్రెస్ బాగా దిగజారిపోయిందని, నిందితులను అరెస్టు చేయడానికి బదులు.. వాళ్లను కాపాడేందుకు తమమీద బురద జల్లుతున్నారని ఆమె చెప్పారు. తమ పార్టీ వాళ్లు ఏం చేయాలో పరోక్షంగా ఇలా చెబుతున్నారని.. ఇంత దారుణ వ్యాఖ్యలు చేస్తున్నా సీఎం మమతా బెనర్జీ ఏం చేస్తున్నారని బృంద ప్రశ్నించారు.