శాఖాపరమైన విచారణకు మాజీ ఉద్యోగులు
న్యూఢిల్లీ: వివిధ మంత్రిత్వ విభాగాల్లో శాఖాపరమైన విచారణలు నిర్వహించేందుకు మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మాజీ ఉద్యోగులను నియమించాలని కేంద్రం నిర్ణయించింది. వివిధ రకాలైన ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై నిర్వహించే శాఖాపరమైన విచారణలో జాప్యం నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ (డీఓపీటీ) గురువారం ఒక ప్రకటనలో తెలిపింది.
దర్యాప్తు అధికారులుగా నియమితులైన రిటైర్డ్ ఉద్యోగులకు రూ.20 వేల నుంచి, రూ.75వేల వరకు ఆయా కేసుల స్థాయిని బట్టి కేసుల వారీగా చెల్లిస్తారు. రవాణా అలవెన్స్ కింద రూ. 40వేలు, సదరు మంత్రిత్వ శాఖ నుంచి సహాయకుల సహాయం అందని సందర్భంలో మరో రూ.30 వేలు అందిస్తారు. కేంద్ర ప్రభుత్వంలో డిప్యూటీ సెక్రటరీ స్థాయి ర్యాంకు.. రాష్ట్ర ప్రభుత్వాలు.. ప్రభుత్వ రంగ సంస్థల్లో అంతకు సమాన స్థాయి హోదాలో పదవీ విరమణ పొందిన ఉద్యోగులను మాత్రమే నియమిస్తారు.