‘మిస్ దివా యూనివర్స్’గా నేహల్
ముంబై: ఈ ఏడాది డిసెంబర్లో జరిగే మిస్ యూనివర్స్ పోటీల్లో భారత్ తరఫున నేహల్ చుడాసమా పోటీపడనుంది. 22 ఏళ్ల ఈ భామ శుక్రవారం రాత్రి ముంబైలో జరిగిన ‘మిస్ దివా యూనివర్స్ 2018’గా కిరీటాన్ని సొంతం చేసుకుంది. దీంతో మిస్ యూనివర్స్–2018 పోటీల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. గెలుపు అనంతరం నేహల్ మాట్లాడుతూ ‘నా చిరకాల స్వప్నం నిజం కావడాన్ని నమ్మేందుకు నాకు కొంత సమయం పట్టింది. భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించడమే కాకుండా..మిస్ యూనివర్స్ టైటిల్ గెలవడం నా కల. ఎన్నో ఏళ్లుగా ఈ రోజు కోసమే కష్టపడ్డా.
ఈ ప్రయాణాన్ని ముందుకు కొనసాగించేందుకు ఎదురుచూస్తున్నాను’ అని ఉద్వేగంతో చెప్పింది. గతంలో ఎన్నో వైఫల్యాల్ని ఎదుర్కొన్నానని, అయితే అందాల కిరీటం సొంతం చేసుకుంటాననే నమ్మకం ఎప్పుడూ కోల్పోలేదని ఆమె పేర్కొంది. తన లక్ష్యం గురించి వివరిస్తూ.. మిస్ యూనివర్స్ పోటీలు ముగిశాక సివిల్స్ పరీక్షలకు సన్నద్ధమవుతానని వెల్లడించింది. ‘మిస్ దివా∙సుప్రానేషనల్’గా అదితి హుండియ, మిస్ దివా 2018 రన్నరప్‌గా రోష్నీ షెరన్ నిలిచారు. మిస్ యూనివర్స్ 2017 విజేత డెమి పీటర్స్, బాలీవుడ్ నటులు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, శిల్పా శెట్టి, నేహా దూఫియా, లారా దత్తా తదితరులు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు.