30 రోజుల్లో మార్చేశారు
అభివృద్ధి నినాదానికే రాజధాని ఓటు
విజయవంతమైన టీఆర్ఎస్ ‘మిషన్ -100’
సాక్షి, హైదరాబాద్: ఇరవై నెలల క్రితం జరిగిన సాధారణ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో టీఆర్ఎస్కు వచ్చిన శాసనసభ స్థానాలు... కేవలం మూడు! కానీ తాజాగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏకంగా పదహారు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పూర్తిస్థాయిలో పాగా వేసింది! మిగతా ఏడు చోట్లా హోరాహోరీగా పోరాడింది. 100 డివిజన్లలో విజయమే లక్ష్యంగా ‘మిషన్-100’ నినాదంతో బరిలోకి దిగి టీడీపీ, కాంగ్రెస్, బీజేపీల కంచుకోటలను టీఆర్ఎస్ బద్దలు కొట్టడం వెనక పదునైన వ్యూహం, పక్కా కార్యాచరణ దాగున్నాయి.
గత సాధారణ ఎన్నికల్లో సరైన క్యాడర్ లేని కారణంగా అనేక స్థానాల్లో ఓటమి పాలైన దృష్ట్యా జీహెచ్ఎంసీ ఎన్నికను టీఆర్ఎస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మంత్రులు, ఎమ్మెల్యేలు మొదలుకుని పార్టీ నేతలంతా రాజధాని అంతటా సుడిగాలి ప్రచారం చేశారు. ముఖ్యంగా 30 రోజుల వ్యవధిలోనే పరిస్థితిని టీఆర్ఎస్కు పూర్తి అనుకూలంగా మార్చేశారు. ‘హైదరాబాద్ విశ్వనగరం కావాలంటే కేసీఆర్ నాయకత్వాన్ని, ఆయన అభివృద్ధి నినాదాన్ని బలపర్చండి’ అంటూ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో మంత్రులు, 50 మందికి పైగా ప్రజాప్రతినిధులు తదితర నాయకులు ఇంటింటినీ చుట్టేశారు.
ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు నుంచే మంత్రులు, ఇతర వ్యూహ బృందాలు డివిజన్ కేంద్రాల్లో బస చేసి, పోలింగ్ బూత్‌లవారీగా ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తూ వెళ్లారు. బలహీనంగా ఉన్నచోట్ల పార్టీ ముఖ్యులతో ప్రచారసభలు నిర్వహించి, ప్రాంతం, సామాజికవర్గాలవారీగా ప్రత్యేక సమావేశాలు పెట్టి, ‘మమ్మల్ని బలపరచండి’ అంటూ చేసిన విజ్ఞప్తులు కూడా బాగా ఫలించాయి. ఇక గ్రేటర్ ప్రచారాన్నంతా భుజాన వేసుకున్న కేటీఆర్ విద్యార్థులు, ఐటీ, మెడికల్, బిజినెస్, సినిమా తదితర ప్రముఖులు, ప్రొఫెషనల్స్‌తో ముఖాముఖి నిర్వహించి తమ విజన్‌ను పక్కాగా ఆవిష్కరించగలిగారు. ఫలితంగా ఉప్పల్, ఎల్బీ నగర్, శేరిలింగంపల్లి, మల్కాజిగిరి, కూకట్పల్లి తదితర అసెంబ్లీ స్థానాల పరిధిలోని పలు డివిజన్లలో టీఆర్ఎస్ అభ్యర్థులకు ఏకంగా 8 నుండి 15 వేల వరకు మెజారిటీ రావడం విశేషం.