బిచ్చమెత్తుకుంటున్న హీరోయిన్
ముంబై: హీరోయిన్ గా ఓ వెలుగు వెలగాలని ఇంట్లో వాళ్లను సైతం లెక్కచేయకుండా ముంబై బాటపడుతున్న అమ్మాయిల విషాద గాథల్లో మరో నటి ఉదంతం తాజాగా వెలుగుచూసింది. వెండి వెలుగుల జాబిలిగా వెలిగిపోవాలన్న కలలు ఆవిరైపోవడంతో కొందరు ఆత్మహత్యల్ని ఆశ్రయిస్తుండగా..మరి కొందరు మానసిక స్థిమితాన్ని కోల్పోయి, దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారు. ఓ భోజ్ పురి చిత్రంలో హీరోయిన్ గా నటించిన మిథాలి శర్మ (25)దాదాపు ఇలాంటి పరిస్థితుల్లోనే కొట్టుమిట్టాడుతూ.. మతి స్థిమితం కోల్పోయి ముంబై వీధుల్లో బిచ్చమెత్తుకుంటూ పోలీసుల కంటపడింది.
ఢిల్లీకి చెందిన మిథాలీ శర్మ సినిమాలమీద ఆసక్తితో ముంబైకి మకాం మార్చింది. మోడల్ గా కరియర్ స్టార్ట్ చేసింది. ఎట్టకేలకు భోజ్‌పురీ చిత్రంలో హీరోయిన్గా నటించే అవకాశం వచ్చింది. అయితే ఆ చిత్రం విజయం సాధించకపోవడంతో హీరోయిన్గా నటించే అవకాశాలు రాలేదు. అటు సినిమాల్లో నిలదొక్కుకోలేక ఇటు తల్లిదండ్రులకు ముఖం చూపించలేక మిథాలీ జీవితం దుర్భరంగా మారింది. దీంతో ముంబైలోని లొకండ్ వాలా వీధుల్లో బిచ్చమెత్తుకుంటూ, చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ బతుకుతోంది. ఈక్రమంలో ఒష్విరా హౌసింగ్ సొసైటీలో ఆగి ఉన్న ఒక కారు అద్దాలను పగుల కొడుతుండగా ఆమెను మహిళా పోలీసులు గుర్తించి ఆసుపత్రికి తరలించారు.
ఆమె మానసిక స్థితి బాగాలేదని, ఆమె కుటుంబ సభ్యల వద్దకు చేర్చడానికి ప్రయత్నిస్తున్నామని సీనియర్ పోలీస్ అధికారి సుభాష్ చెప్పారు. ఆమె కోలుకోవడానికి , తిరిగిసాధారణ స్థితికి చేరడానికి కనీసం పది రోజులు పడుతుందని మిథాలీకి చికిత్సం అందిస్తున్న మానసిక వైద్యులు తెలిపారు.