నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడి !
రఘునాధపాలెం, న్యూస్‌లైన్: ఆభం శుభం తెలియని నాలుగు సంవత్సరాల చిన్నారిపై కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ కామాంధుడు లైగింకదాడికి పాల్పడ్డాడు. సభ్య సమాజం తలదించుకునేలా ఒక వికలాంగుడు చిన్నారిని ముద్దాడుతున్నట్లు నటించి.. తన మూడుచక్రాల బండిపై చీకటి ప్రదేశంలోకి తీసుకెళ్లి ఈఘోరానికి ఒడిగట్టాడు. దారుణమైన ఈ ఘటన ఖమ్మం జిల్లా రఘునాధపాలెం మండలం మంచుకొండలో మంగళవారం రాత్రి చోటు చేసుకొంది. మిట్టపల్లి శివ, శ్రీలత దంపతులకు ఇద్దరు సంతానం.
శివ సెంట్రింగ్ పనికోసం చెన్నై వెళ్లగా.. ఇద్దరు కూతుర్లతో తల్లి మంచుకొండలో ఉంటూ కూలీ పనులు చేసుకుంటోంది. వారి ఇంటికి సమీపంలోనే తోట నర్సింహరావు అనే వికలాంగుడు వెల్డింగ్ పని చేస్తూ ఉంటాడు. శివ కూతుర్లను తరచూ తన మూడు చక్రాల బండిపై తిప్పుతుండేవాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి కూడా పెద్ద కూతురు(4)ను బండిపై ఎక్కించుకుని ఇంటికి దూరంగా చీకటి ప్రాంతంలోకి తీసుకెళ్లి ఈ దారుణానికి పాల్పడ్డాడని గ్రామస్తులు చెపుతున్నారు. ఇంట్లో అడుకుంటున్న కూతురు కనిపించకపోవడంతో తల్లి ఇంటిపక్క వాళ్లను ఆరా తీసింది. నర్సింహరావు తన బండిపై చిన్నారిని తీసుకెళ్లాడని చెప్పడంతో ఆమె వెతుక్కుంటూ వెళ్తుండగా, దూరంగా పాప ఏడుపు వినిపించింది.
అక్కడికి వెళ్లే సరికి మద్యం మత్తులో తన వంటిపై వస్త్రాలు లేకుండా పడిఉన్న నరిసింహరావును, పక్కనే ఏడుస్తున్న చిన్నారిని గుర్తించారు. నరిసింహరావును కొట్టి అక్కడే తాళ్లతో బంధించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు చిన్నారిని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘోరం చూసిన తల్లి శ్రీలత పిట్స్ వచ్చి పడిపోవడంతో ఆమెను కూడా 108 ద్వారా ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని ఎస్ఐ గణేష్ స్టేషన్‌కు తరలించారు. కామాంధుఢిని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు.