ఉమ్మడిగా.. ఉత్సాహంగా
సకుటుంబ సపరివారంగా భోగి ఉత్సవాలు
పల్లె వాతావరణంలో వెలిగిపోయిన మురళీనగర్
హాజరైన ఉత్తర నియోజకవర్గ
ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు దంపతులు
మురళీనగర్ వైశాఖి స్పోర్ట్సు పార్కులో భోగి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కాలనీలోని వారంతా కలిసి ఉమ్మడిగా పండగను జరుపుకున్నారు. కాలనీ వాసులంతా కదలి వచ్చి వయోభేదం లేకుండా పిల్లా పాపలతో ఉత్సవాల్లో పాల్గొన్నారు. వందలాది కుటుంబాలు తరలిరావడంతో పాటు పల్లెవాతావరణాన్ని తలపించే విధంగా ఉత్సవాలు జరిగాయి. ఎక్కడ చూసినా సంక్రాంతి ముగ్గులు మెరిసిపోయాయి. ఉత్తర నియోజకవవర్గం ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్ రాజు దంపతులు కార్యక్రమంలో పాల్గొన్నారు. తెల్లవారుజాము నుంచి ఉత్సవాలు పూర్తయ్యే వరకు అక్కడే ఉండి ప్రజలను ఉత్సాహపరిచారు.
అలరించిన కళారూపాలు
ఉత్సవాలు భోగి మంటలతో ప్రారంభమయ్యాయి. ఉత్సవ ప్రాంగణంలోకి అందరూ తెలుగు సంప్రదాయ దుస్తుల్లో తరలి వచ్చారు. భోగిమంటల్లో పాత ఆశలను వదిలేసి నూతన ఉషస్సు కోసం ఆకాంక్షిస్తూ భోగిమంటల చుట్టూ చేరి ఆనందంగా గడిపారు. ఒక వైపు భోగిమంటలు వేస్తుండగా మరోవైపు మహిళలు కొత్త బియ్యంతో భోగి జావ తయారు చేసి అందరికి ప్రసాదంగా అందజేశారు. హరిలో రంగ హరీ అంటూ హరిదాసు కీర్తనలతో హరిదాసు విష్ణు స్తుతి గీతాలతో ఆధ్మాత్మికత సంతరించుకుంది. గంగిరెద్దు విన్యాసాలు, పద్మనాభం మండలం అనందపురం గ్రామానికి చెందిన తప్పెట గుళ్ల కళాకారుల విన్యాసాలు విశేషంగా అలరించాయి. పులివేషధారులు మంటల్లో చేసిన విన్యాసాలు ఒళ్లు గగుర్పొడిచాయి. స్వాగత నృత్యం, కూచిపూడి నృత్యాలు, వనితా వాకర్స్ మహిళల కోలాటాలు, దాండియా నృత్యాలు పండగకు మరింత వన్నె తెచ్చాయి.
అంతా ఒకటై.. ఆనందించిన వేళ
డప్పుల శబ్దాలకు ఆడా, మగా, చిన్నా, పెద్దా తేడా లేకుండా నృత్యాలు చేసి ఆనందంగా గడిపారు. ఎమ్మెల్యే విష్ణు కుమార్రాజు వారితో పాటు జతకలిసి మరింత ఉత్సాహాన్ని నింపారు. బామ్మలు తాతయ్యలు తమ బాల్య స్మృతులను గుర్తుకు తెచ్చుకుని మురిసిపోయారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు ముగ్గుల పోటీల్లో విజేతలకు బహుమతులు అందించారు. అనంతరం ఎమ్మెల్యే దంపతులు చిన్నారులకు భోగిపళ్లు వేసి దీవెనలు అందజేశారు. ప్రజలందరూ సుఖ శాంతులతో ఉండాలని ఎమ్మెల్యే ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి రొంగలి జగన్నా«థం, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జె.పృథ్వీరాజ్, స్వాతి ప్రమోటర్స్ అధినేత ఎం.కృష్ణారెడ్డి, వైశాఖి స్పోర్ట్స్ పార్కు అధ్యక్ష, ఉపాధ్యక్షులు దుర్గా ప్రసాద్, సనపల వరప్రసాద్, కార్యదర్శి నారాయణరావు, టీఎన్ రెడ్డి, కూర్మారావు, 39వ వార్డు వైఎస్సార్సీïపీ అధ్యక్షుడు ఎస్.మౌళి, వాకర్స్ క్లబ్ కార్యదర్శి కె.త్రిపుర సుందరరావు, వనితా వాకర్స్ క్లబ్ కార్యదర్శి వి.జయప్రభాశర్మ, ఎస్.వరప్రసాద్ పాల్గొన్నారు.