పుస్తకాలొచ్చేశాయ్!
రేపు ప్రపంచ పుస్తక దినోత్సవం
‘‘ఈ మధ్య ఏ పుస్తకం చదివారు వదినా?’’ అనే మాట వినక ఎంతకాలమైంది...తనలో తాను అనుకుంది రజనీబాయి. పుస్తకాలు విపరీతంగా చదివే బంగారు కాలం ఒకటి ఉండేది. తాము చదవడమే కాదు పక్కింటి వాళ్లతో కూడా చదివించేవారు.
వినోద మాధ్యమాల దెబ్బతో - ‘‘ఈ మధ్య ఏ సీరియల్ చూశావు’’ అనే మాట తప్ప వేరే మాట వినిపించని పరిస్థ్థితిలో పుస్తకపఠనం అనే మంచి అలవాటును తిరిగి కొనసాగించడానికి నడుం బిగించింది కేరళలోని కోజిక్కోడ్కు చెందిన రజనీ. చేతి నిండా, బ్యాగు నిండా పుస్తకాలు సర్దుకొని వారంలో ఆరురోజులు ఊరూరూ తిరుగుతుంది.
రోజూ పాతిక ఇళ్లకు తక్కువ కాకుండా వెళుతుంది. తన చేతుల్లో ఉన్న పుస్తకాల గురించి చెబుతుంది. కొందరు వారానికి రెండు, కొందరు మూడు పుస్తకాలు తీసుకుంటారు. రజనీని ‘మొబైల్ లైబ్రేరియన్’ అని కూడా పిలుస్తుంటారు. ఆమె దగ్గర ఉన్న పుస్తకాలలో కాలక్షేప సాహిత్యంతో పాటు, సామాజికస్పృహతో కూడిన సాహిత్యపుస్తకాలు కూడా ఉంటాయి.
పాఠకుల అభిరుచికి తగ్గ పుస్తకాలను అద్దెకిస్తుంటుంది. పుస్తకాల అద్దె నెలకు 20 రూపాయలు. పుస్తకాల అద్దె ద్వారా నెలకు రూ. 1200 గడిస్తుందామె. ‘‘నాకు వచ్చే ఆదాయం తక్కువ కావచ్చు. తృప్తి మాత్రం చాలా ఎక్కువ’’ అంటుంది రజని చిరునవ్వుతో. అవును కదా!