మరణంలోనూ వీడని సోదర బంధం
కుటుంబ సభ్యులను కాపాడే {పయత్నంలో ప్రాణాలు కోల్పోయిన అన్నదమ్ములు
కళ్లముందే తోడును కోల్పోయిన తోడికోడళ్లు
విహారయాత్రంలో విషాదం
నక్కపల్లి/ ఎస్.రాయవరం: మృత్యువు కూడా రక్త సంబంధాన్ని విడదీయలేకపోయింది. కుటుంబ సభ్యులను రక్షించే ప్రయత్నంలో అన్న దమ్ములిద్దరూ సముద్రంలో మునిగి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. తోడికోడళ్లిద్దరూ తోడు కోల్పోయి అనాథలుగా మిగిలారు. ఆపదలో ఉన్న కుటుంబ సభ్యులను రక్షించేందుకు వీరు చేసిన ప్రాణత్యాగానికి వారు ప్రత్యక్షసాక్షులుగా మిగిలిపోయారు. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పాయకరావుపేట శాంతినగర్‌కు చెందిన మహ్మద్ రియాజ్ (38) మహ్మద్ దావూద్‌వాహబ్(36)లు అన్నదమ్ములు.
రియాజ్‌కు భార్య షాజీబేగం, ముగ్గురు పిల్లలు అబ్దుల్హ్మ్రన్, రియాజ్, సానియా ఉన్నారు. వాహబ్కు భార్య హారిక్, పిల్లలు రెహ్మన్, ఇషాన్ ఉన్నారు. ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌లో ఉన్న వాహబ్ ఇటీవల పాయకరావుపేట రావడంతో శనివారం రెండు కుటుంబాలు కలసి బంగారమ్మపాలెం సముద్రతీరానికి విహార యాత్రకు వెళ్లారు. మొగ (మూడు నదులు కలిసే సంగమం) వద్దకు బోటులో వెళ్లారు. భోజనాల అనంతరం ఇసుక తిన్నెలపై ఆనందంగా గడిపారు. ఈత కొడదామన్న సరదాతో సముద్రంలోకి దిగారు. పక్కనే ఉన్న చిన్నపాటి పాడైన బోటుపై కుటుంబ సభ్యులు ఆడుకుంటున్నారు. కెరటాలు బలంగా రావడంతో ఆడుకుంటున్న పిల్లలు నీటిలో పడిపోయారు. వారి కోసం తల్లులు కూడా నీటిలో దిగారు. ఇది చూసి అన్నదమ్ములిద్దరూ కుటుంబసభ్యులను సురక్షితంగా ఇసుక తిన్నెలపై చేర్చారు.
ఇంతలో కెరటాలు మరింత ఉధృతంగా రావడంతో అన్నదములు సముద్రంలో మునిగిపోయారు. అక్కడే ఉన్న నేవీ సిబ్బంది, మత్య్సకారులు వారిని ఒడ్డుకు చేర్చారు. నీరు ఎక్కువగా తాగడంవల్ల అపస్మారక స్థితికి చేరుకున్నారు. కొన ఊపిరితో ఉన్న వారిని నక్కపల్లి ఏరియా ఆస్పత్రికి ఆటోలో తరలించారు. మార్గమధ్యలోనే వీరు మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుల పిల్లలంతా పదేళ్లలోపు వయసు వారే, తండ్రి మరణించారన్న విషయం వారికింకా తెలపలేదు. కళ్లముందే తమను రక్షించే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయి విగత జీవులుగా పడి ఉన్న భర్తల మృతదేహాల వద్ద తోడికోడళ్లు రోదిస్తున్న తీరు స్థానికులను కలిచి వేసింది. ప్రమాద విషయం తెలిసిన బంధువులు, స్నేహితులు అధిక సంఖ్యలో నక్కపల్లి ఆస్పత్రికి చేరుకున్నారు. మృతులు నివాసముంటున్న పాయకరావుపేట శాంతినగర్‌లో విషాద ఛాయలు అలముకున్నాయి. మృతులకు తల్లి ఉంది. ఆమె హుద్‌హుద్ తుఫాన్ సమయంలో ఆందోళనతో గుండెజబ్బుకు గురై తీవ్ర అనారోగ్యంతో ఉంది. దీంతో కుమారుల మరణవార్త ఆమెకు చెప్పలేదు.