‘మాలిక్యులర్ మెషీన్స్’కు కెమిస్ట్రీ నోబెల్
ముగ్గురు శాస్త్రవేత్తలకు సంయుక్తంగా బహుమతి
స్టాక్‌హోమ్: అణువుల స్థాయిలో పనిచేసే యంత్రాల (మాలిక్యులర్ మెషీన్స్)ను అభివృద్ధి చేసిన ముగ్గురు శాస్త్రవేత్తలను ఈ ఏడాది రసాయన శాస్త్ర(కెమిస్ట్రీ) నోబెల్ వరించింది. జీన్ పియర్ సావేజ్(ఫ్రాన్స్), జె ఫ్రేజర్ స్టోడార్ట్(బ్రిటన్), బెర్నాండ్ ఫెరింగా(నెదర్లాండ్స్)లను రసాయన నోబెల్ బహుమతికి ఎంపిక చేసినట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ బుధవారం ప్రకటించింది. వీరు అత్యంత సూక్ష్మమైన మోటార్లను రూపొందించి, విజయవంతంగా నియంత్రించగలిగారని పేర్కొంది. అత్యాధునిక సెన్సర్లు, సరికొత్త పదార్థాలు, విద్యుత్‌ను నిల్వ చేసుకోగలిగే వ్యవస్థల అభివృద్ధికి మాలిక్యులర్ మెషీన్స్‌పై పరిశోధన తోడ్పడుతుందని తెలిపింది. డిసెంబర్ 10న బహుమతి కింద అందించే రూ.6.19 కోట్ల (8 మిలియన్ స్వీడిష్ క్రోనార్ల)ను ఈ ముగ్గురు సమానంగా పంచుకుంటారు.
ఏమిటీ మాలిక్యులర్ మెషీన్స్?
అణువుల స్థాయిలో అత్యంత సూక్ష్మంగా రూపొందించినవే మాలిక్యులర్ మెషీన్స్(అణు యంత్రాలు). వీటికి శక్తిని అందిస్తే మోటార్ల తరహాలో తిరుగుతాయి. తమకన్నా ఎన్నో రెట్లు పెద్దవైన వాటినీ కదిలిస్తాయి. సూక్ష్మమైన రోబోట్లను రూపొందించడానికి, కృత్రిమ అవయవాల రూపకల్పనకు కూడా ఈ మాలిక్యులర్ మెషీన్స్ ఉపయోగపడతాయి. మన శరీరంలోని ప్రొటీన్లు కణాంతర్గత స్థాయిలో బయోలాజికల్ యంత్రాల లాగా పనిచేస్తాయి.
దీనిని స్ఫూర్తిగా తీసుకుని ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు... కేవలం కొన్ని అణువులు లేదా పరమాణువులను అనుసంధానించి మాలిక్యులర్ మెషీన్లను అభివృద్ధి చేశారు. వీటినే నానో యంత్రాలు లేదా నానోబోట్స్గా కూడా వ్యవహరిస్తుంటారు. కాం తిని పంపడం, ఉష్ణోగ్రతలో మార్పు చేయడం ద్వారా ఈ మెషీన్లను నియంత్రించగలిగేలా రూపొందించారు. వీటిని నానో స్థాయిలో మోటార్లుగా, చక్రాలుగా, పిస్టిన్లుగా, ఇతర నానో పదార్థాలను కదిలించగలిగే పరికరాలుగా వాడుకోవచ్చు.
భవిష్యత్తు మాలిక్యులర్ యంత్రాలదే!
ప్రస్తుతం మనం వినియోగిస్తున్న ఎలక్ట్రిక్ (విద్యుత్‌తో నడిచే) మోటార్ కూడా 1830 సమయంలో అత్యంత ప్రాథమిక స్థాయిలో ఉంది. అప్పుడు అతిపెద్ద మోటార్ కూడా ఓ మోస్తరుగానే పనిచేసేది. ఇప్పుడు ఫ్యాన్లు, మిక్సీలు, వాషింగ్ మెషీన్ల దగ్గరి నుంచి ఎలక్ట్రిక్ రైళ్లు, కార్ల దాకా మనచుట్టూ అన్నీ ఎలక్ట్రిక్ మోటార్లతోనే పనిచేస్తున్నాయి. ఇదే తరహాలో భవిష్యత్తులో మాలిక్యులర్ మెషీన్ల వినియోగంవిస్తృతమవుతుందని రాయల్ స్వీడిష్ అకాడమీ జ్యూరీ పేర్కొంది. కొత్త పదార్థాల రూపకల్పన, సెన్సర్లు, శక్తిని నిల్వ చేసే వ్యవస్థలతో పాటు ఎన్నో రంగాల్లో మాలిక్యులర్ మెషీన్లు కీలక పాత్ర పోషిస్తాయని వెల్లడించింది.