గోమాత, మఠ మందిరాలను కాపాడుకోవాలి
భువనగిరి : హిందూ సమాజంలో అత్యధికంగా పూజింపబడే మాతా, గోమాత, మఠమందిరాలను కాపాడుకోవాలని కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల సంఘటన కార్యదర్శి గోపాల్జీ అన్నారు. మంగళవారం పట్టణంలోని ఎస్ఆర్కే ఫంక్షన్ హాల్లో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన భువనగిరి జిల్లా విసృతస్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. హిందూ ధర్మం తన పూర్వవైభవం, విశ్వగురు స్థానాన్ని తిరిగి సాధించే రోజు రాబోతుందన్నారు. ఇందుకోసం హిందువులంతా, వీహెచ్పీ కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. మత మార్పిడులను అడ్డుకోవాలని తెలిపారు. అలాగే క్షేత్రగోరక్షా ప్రముఖ్ టి. యాదగిరిరావు మాట్లాడుతూ ముక్కోటి దేవతలకు నిలయమైన గోవులను రక్షించుకోవడం మన ధర్మమని, గోవుకు ఉన్న విశిష్టతలు శాస్త్ర రీత్యా నిరూపించబడిందన్నారు. కార్యక్రమంలో వీహెచ్పీ రాష్ట్ర సహ కార్యదర్శి పుల్లా సత్యనారాయణ, జిల్లా అధ్యక్షుడు గంగం యాదగిరిరెడ్డి, ఉపాధ్యక్షుడు మాటురి మల్లేశ్వరం, కార్యదర్శి తోట భాను ప్రసాద్, కామేటిగారి కృష్ణ, పసుపునూరి మనోహర్, బండి సురేష్, ఎనబోయిన రాజేందర్, కూర నాగేందర్, నరేష్ తదితరులు ఉన్నారు.