అమ్మో ఒకటో తారీఖు
బ్యాంకు నిబంధనలతో ఆందోళనలో ఉద్యోగులు, పెన్షనర్లు
ఆర్బీఐ నిబంధనలు సడలించాలని డిమాండ్
జిల్లాలో 52 వేల మంది ఉద్యోగులు, 40 వేలమంది పెన్షనర్లు
వెంకటేశ్వరరావు విద్యాశాఖ పరిధిలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. నెల నెలా వచ్చే జీతమే అతనికి ఆధారం. ఒకటో తేదీన జీతం రాగానే ఇంటి అద్దె, పాలబిల్లు, కిరాణా బకాయిలు, పిల్లల ఫీజులు, బ్యాంకులో రుణానికి సంబంధించిన వాయిదాలు చెల్లించాల్సి ఉంది. మరో పది రోజుల్లో జీతం వస్తుందన్న ఆనందం కన్నా.. రాబోయే జీతం చేతికి ఎలా వస్తుందన్న ఆందోళనే అతడిలో నెలకొంది. కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేయడమే ఇందుకు కారణం. ఈ ఆందోళన ఒక్క వెంకటేశ్వరరావుదే కాదు.. వేతన జీవులందరిదీ..
రాయవరం :
పెద్ద నోట్ల రద్దు ప్రభావం అనంతరం బ్యాంకు ఖాతాలో ఉన్న సొమ్మును విత్‌డ్రా చేసుకోవడానికి ప్రభుత్వం విధించిన నిబంధనల నేపథ్యంలో నవంబర్ జీతం డిసెంబర్ నెలలో చేతికి ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో నెలనెలా వేతనాలు పొందే ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఆందోళన చెందుతున్నారు. రూ.500, రూ.1,000 నోట్ల ప్రభావంతో గత 12 రోజులుగా తీవ్ర అస్తవ్యస్త పరిస్థితులు నెలకొన్నాయి. ఖాతాలో ఉన్న సొమ్ము విత్‌డ్రా చేయడానికి గంటల తరబడి క్యూల్లో వేచి ఉండడం, ఏటీఎంలలో డబ్బులు నిండుకోవడంవంటి పరిస్థితుల్లో సామాన్య, మ ధ్య తరగతి ప్రజలు ఇప్పటికీ తీవ్ర ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితు ల్లో సగటు ఉద్యోగి నెలనెలా వేసుకునే బడ్జెట్ లెక్కలు కూడా తారుమారయ్యే అవకాశం ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు, ప్రభుత్వ, ప్రైవేటురంగ సంస్థల్లో పని చేసే వేలాది మంది ఉద్యోగులు, పెన్షనర్లు ఒకటో తేదీనే జీతభత్యాలు అందుకుంటా రు. ప్రస్తుతం బ్యాంకులు, ఏటీఎంల వద్ద బారులు తీరుతున్న ఖాతాదారులకే రిజర్వ్ బ్యాంకు పంపిస్తున్న సొమ్ము సరి పోవడం లేదు. ఈ పరిస్థితుల్లో ఒకటో తేదీన జీతాలు పొందే పరిస్థితి ఉంటుం దా? లేదా? అనే ప్రశ్నలు ఉద్యోగులను, పెన్షనర్లను వేధిస్తున్నాయి.
విత్‌డ్రాయల్ పరిమితి రూ.24 వేలు
రిజర్వ్‌బ్యాంక్ నిబంధనల ప్రకారం బ్యాంకుల నుంచి వారానికి రూ.24 వేలు మాత్రమే విత్‌డ్రా చేసుకునే వీలుంది. అయినప్పటికీ బ్యాంకుల్లో తగినంత నగదు లేకపోవడంతో ఒక్కో ఖాతాదారుకు రూ.10 వేలు మాత్రమే ఇస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తాము జీతభత్యాలు ఎలా పొందాలోనని ఉద్యోగులు, పెన్షనర్లు అయోమయానికి గురవుతున్నారు. ఎదుర్కొంటున్నారు. ఆర్బీఐ నుంచి జిల్లాకు పెద్ద మొత్తంలో నగదు వస్తేనే కానీ వారికి ఉపశమనం కలిగే పరిస్థితి కనిపించడంలేదు. ప్రతి ఉద్యోగికి జీతభత్యాలు వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో.. బ్యాంకు నుంచి పరిమితంగా డ్రా చేసే సొమ్ముతో నెలవారీ బడ్జెట్ ఎలా లాక్కురావాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. నెల జీతంతో ఇల్లు గడవని చిరుద్యోగులు డిసెంబరు నెలలో కళ్లముందు కనిపి స్తున్న భవిష్యత్తును తలచుకుని ఆందోళన చెందుతున్నారు.
నిబంధనలు సడలిస్తేనే..
జీతభత్యాల కింద జమయ్యే నగదును పూర్తి స్థాయిలో డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించాలని ఉద్యోగులు, పెన్షనర్లు డిమాం డ్ చేస్తున్నారు. జిల్లాలో సుమారు రూ.52 వేల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, మరో 40 వేల మంది ప్రభుత్వ పింఛన్ దారులు ఉన్నారు. ఉద్యోగులకు హోదానుబట్టి రూ.20 వేల నుంచి రూ.లక్ష పైబడి వేతనాలు వస్తున్నాయి. ఒక్కో ఉద్యోగికి సరాసరిన రూ.30 వేలు చూసినా కేవలం ఉద్యోగుల వేతనాల రూపేణా సుమారు రూ.150 కోట్లు అవసరమవుతాయి. ఉద్యోగుల వేతనాలు నగదు రూపంలోనే చెల్లించాలని ఇప్పటికే గోవా ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వానికి వినతిపత్రం అందజేశారు.
నగదు రూపంలో చెల్లించాలి
ఉపాధ్యాయుల వేతనాలను ఎంఈవో కరెంట్ అకౌంట్‌కు వేసి దానినుంచి నగదు రూపంలో వేతనాలు చెల్లించాలి. లేకుంటే ఇబ్బందులు తప్పేలా లేవు. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలి.
– టీవీ కామేశ్వరరావు, జిల్లా ప్రధాన
కార్యదర్శి, యూటీఎఫ్
గ్రూపు చెక్కు ద్వారా చెల్లించాలి
గతంలో చెల్లించిన మాదిరిగా ఉపాధ్యాయులకు గ్రూపు చెక్కు రూపంలో వేతనాలు చెల్లించాలి. రోజుకు రూ.2 వేల చొప్పున ఏటీఎంల ద్వారా నగదు తీసుకోవడం ఇబ్బంది కలుగుతోంది.
– కవి శేఖర్, జిల్లా ప్రధాన
కార్యదర్శి, ఎస్టీయూ
పరిస్థితిని చక్కదిద్దాలి
బ్యాంకుల నుంచి వేతన సొమ్మును విత్‌డ్రా చేసుకోవడం ప్రస్తుత పరిస్థితుల్లో కష్టం. ప్రభుత్వం చొరవ తీసుకుని పరిస్థితిని చక్కదిద్దాలి. లేకుంటే ఉద్యోగులకు కష్టాలు తప్పవు.
– సీహెచ్ ప్రదీప్‌కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి, పీఆర్టీయూ
అవసరమైనంత
నగదు పంపాలి
ఉద్యోగులకు సరిపడినంత నగదును బ్యాంకులకు రిజర్వు బ్యాంకు పంపించాలి. ఉద్యోగుల వేతనాలను పూర్తిస్థాయిలో విత్‌డ్రా చేసుకునే అవకాశం కల్పించాలి. నగదు రహిత లావాదేవీలు జరిపే పరిస్థితి ఇంకా ఏర్పడలేదు. ఈ నెలకు మాత్రం వెసులుబాటు కల్పించాలి.
– పితాని త్రినాథరావు,
జేఏసీ జిల్లా కన్వీనర్, కాకినాడ