పెళ్లింట విషాదం..
=మరమ్మతులు చేస్తుండగా భవనం కూలి ముగ్గురి మృతి
=నిర్లక్ష్యపు కూల్చివేత వల్లే ప్రమాదం
= శోకసంద్రంలో మూడు కుటుంబాలు
కొద్దిరోజుల్లో పెళ్లి వేడుకల్లో మునిగితేలాల్సిన ఆ ఇంట తీరని విషాదం అలుముకుంది. పాత భవనం మరమ్మతులు చేస్తుండగా భవనం కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో పెళ్లి కుమార్తె మేనమామలు ఇద్దరు, పెదనాన్న మృతిచెందారు. విజయవాడ వన్‌టౌన్‌లో గురువారం ఈ విషాదం చోటుచేసుకుంది.
విజయవాడ, న్యూస్‌లైన్ : మరో వారం రోజుల్లో ఆ ఇంట పెళ్లి వేడుక జరగాల్సి ఉంది... ఇప్పుడిప్పుడే పెళ్లి పనులు వేగం పుంజుకున్నాయి... పెళ్లి ఏర్పాట్లు... పెళ్లికి ఎవరిరెవరిని పిలిచారనే ముచ్చట్లలో బుధవారం రాత్రి పొద్దుపోయేవరకు ఆ కుటుంబం కులాసాగా కబుర్లు చెప్పుకుంది. పెళ్లి కుమార్తె పూర్ణిమ లహారికకు తండ్రి లేకపోవడంతో ఆ స్థానంలో ఉండి పెళ్లి పనులు చక్కదిద్దేందుకు వారం రోజుల ముందుగానే పెదనాన్నలతో పాటు మేనమామలందరూ పూనుకున్నారు. పెళ్లి కుమార్తె పెదనాన్న ములంపాక రాము వైజాగ్ నుంచి బుధవారం రాత్రి విజయవాడకు వచ్చారు.
పెళ్లి వేడుకలకు సిద్ధమవుతున్న ఆ ఇంటిలో మృత్యువు విలయతాండవం సృష్టించింది. ప్రహరీ గోడ రూపంలో పెళ్లి కుమార్తె పెదనాన్నతో పాటు ఇద్దరు మేనమామలను బలి తీసుకుంది. పురాతన ఇంటి మరమ్మతుల విషయంలో చూపిన అలసత్వం ప్రధాన కారణంగా కనిపిస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఈ ప్రమాదంలో పెళ్లికూతురు మేనమామలు తమ్మిన వెంకట భావన్నారాయణ (భాను), తమ్మిన చంద్రశేఖర్ (50)తో పాటు పెదనాన్న ములంపాక రాము (60) మృత్యువాత పడ్డారు.
గురువారం ఉదయం కొత్తపేట నెహ్రూ బొమ్మ సెంటర్ సమీపంలోని భీమన వారివీధిలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించడంతో పాటు మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనతో మూడు కుటుంబాలలో తీవ్ర విషాదం నిండిపోయింది. మరో రెండు కుటుంబాలకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది.
కొంప కూల్చిన నిర్లక్ష్యం...
కొత్తపేట నెహ్రూబొమ్మ సెంటర్‌కు సమీపంలోని భీమనవారివీధిలో తమ్మిన వెంకట భావన్నారాయణ (భాను) కుటుంబం నివాసం ఉంటోంది. గత 50, 60 ఏళ్లుగా ఆ కుటుంబం స్థానికంగా అదే ప్రాంతంలో నివాసం ఉండటంతో అందరితో మంచి పరిచయాలు ఉన్నాయి. భాను నివాసం ఉంటున్న భవనానికి గత కొద్ది రోజులుగా మరమ్మతులు చేయిస్తున్నాడు. తూర్పువైపున ఉన్న భవనం నుంచి భాను భవనానికి నడిచేందుకు వీలుగా నిర్మించిన నడక దారిని తొలగించాలని నిర్ణయించుకున్నారు.
ఈ క్రమంలో గురువారం ఉదయం పనులు ప్రారంభించిన కొద్దిసేపటికే భానుకు, సూర్యనారాయణకు మధ్య చిన్నపాటి వివాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దీంతో ఇద్దరి మధ్య వాదనలు తారస్థాయికి చేరి మేడపైన ఉన్న నడక దారిని తొలగించినట్లయితే తన ఇంటి వద్ద ఉన్న మెట్లను తొలగిస్తానంటూ సూర్యనారాయణ మెట్లను ధ్వంసం చేసేందుకు ప్రయత్నాలు చేస్తుండటంతో విషయం ఇతర కుటుంబ సభ్యులకు తెలిసింది. ఇంతలో కేటీ రోడ్డులోని టీవీఎస్ అపార్టుమెంట్లో ప్లాట్‌లో నివాసం ఉంటున్న తమ్మిన చంద్రశేఖర్ తన అన్నయ్య ఇంటికి వద్దకు వచ్చారు.
ముగ్గురి మధ్య చర్చ జరుగుతున్న సమయంలో రాము మేడపై నుంచి కిందకు వచ్చారు. నలుగురు ఇంటి వరండాల్లో నిలబడి మాట్లాడుకుంటుండగా మేడ పైభాగంలో కూలీలు పనులు చేస్తున్నారు. నడక దారిని కూల్చేందుకు గాను మిషన్‌తో తొలిచేందుకు పనులు చేస్తుండగా ఒక్కసారిగా పెద్ద శబ్దం చేసుకుంటూ మొదటి అంతస్తు శ్లాబు, వరండా ప్రహరీ, రేకులు కూలిపోయాయి. ఇదే సమయంలో కింద జరుగుతున్న వాదనను మేడపై వరండాలో నుంచి గమనిస్తున్న భాను తల్లి కృష్ణవేణి పైనుంచి కిందకు జారిపడింది. దీంతో కృష్ణవేణి నడుముకు గాయాలయ్యాయి. ఆమెను వన్‌టౌన్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
వరండా కింద నిలబడి ఉన్న భాను, చంద్రశేఖర్, రాముల తలలపై భవన శకలాలు భారీగా పడటంతో భాను అక్కడిక్కడే మాంసం ముద్దగా కుప్పకూలిపోయారు. సూర్యనారాయణకు చిన్నపాటి గాయాలు కావడంతో వన్‌టౌన్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న కొత్తపేట సీఐ వెంకటేశ్వర్లు హుటాహుటిన తన సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. గాయాలపాలైన చంద్రశేఖర్, రాములను ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో కొద్దిసేపటికే చంద్రశేఖర్ మృతిచెందారు. మరో అరగంటలో రాము కూడా కన్నుమూశారు.
ప్రముఖుల పరామర్శ
ఘటనాస్థలిని వైఎస్సార్ సీపీ నగర కన్వీనర్ జలీల్‌ఖాన్, పశ్చిమ, సెంట్రల్ ఎమ్మెల్యేలు వెలంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, టీడీపీ నగర కన్వీనర్ బుద్దా వెంకన్న, పశ్చిమ ఇన్చార్జి కె.నాగుల్‌మీరా సందర్శించారు. మృతుల కుటుంబసభ్యులను పరామర్శించారు.