ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 251.. నేడే లాంచింగ్!
న్యూఢిల్లీ: భారత్‌లోనే అత్యంత చౌకైన స్మార్ట్‌ఫోన్ ఈ రోజు విడుదల కానుంది. నొయిడాకు చెందిన రింగింగ్ బెల్స్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ ఈ ఫోన్ ను బుధవారం సాయంత్రం ఆవిష్కరించనుంది. 'ఫ్రీడమ్ 251'గా పేర్కొంటున్న ఈ స్మార్ట్‌ఫోన్ ధర అక్షరాల రూ. 251 కావడం గమనార్హం.
పెద్దగా ఎవరికీ తెలియని రింగింగ్ బెల్స్ కంపెనీలో గతంలో రూ. 500 కన్న తక్కువ ధరకు స్మార్ట్ ఫోన్ అందిస్తామని ప్రకటించి ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇప్పుడు ఆ సంస్థ తమ ఫోన్ ధరను రూ. 251గా ఖరారుచేసింది. దీంతో ప్రపంచంలోనే అత్యంత తక్కువ ధరకు లభించే స్మార్ట్ ఫోన్‌గా ఇది నిలువనుంది.
కేంద్ర రక్షణశాఖ మంత్రి మనోహర్ పారికర్, బీజేపీ సీనియర్ ఎంపీ మురళీమనోహర్ జోషి సమక్షంలో న్యూఢిల్లీలో జరిగే కార్యక్రమంలో ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించనున్నారు. కేంద్ర ప్రభుత్వం అందించిన భారీ మద్దతుతో ఫ్రీడమ్ 251 ఫోన్‌ను తయారు చేశామని, ప్రధాని నరేంద్రమోదీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న 'మేకిన్ ఇండియా' పథకంలో భాగంగానే ఈ విజయం సాధించామని రింగింగ్ బేల్స్ సంస్థ ప్రకటించింది. ప్రధాని మోదీ ప్రవచిస్తున్న 'డిజిటల్ ఇండియా' కార్యక్రమానికి ఈ ఫోన్ భారీగా ఊతమందించే అవకాశముంది. అధిక ధరతో స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయలేని గ్రామీణ అట్టడుగు వర్గాలకు ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది. గతంలో బలహీన వర్గాలకు కంప్యూటర్ సేవలను చేరువ చేసేందుకు 'ఆకాశ్ ట్యాబ్లెట్ల' పథకాన్ని కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే.
చౌక ధరకు లభించే ఫోన్ అయినప్పటికీ ఇందులో మంచి ఫీచర్సే ఉన్నట్టు తెలుస్తోంది.. ఫ్రీడమ్ 251లోని ఫీచర్స్ ఇవి:
డిస్ప్లే: నాలుగు అంగుళాలు
ప్రాసెసర్: 1.3GHz quad-core
ర్యామ్: 1 జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 8 జీబీ
ఎక్స్‌పాండబుల్ స్టోరేజీ: 32 జీబీ వరకు
వెనుక కెమెరా: 3.2 మెగాపిక్సెల్
ముందు కెమెరా: 0.3 మెగాపిక్సెల్
బ్యాటరీ: 1450mAh