అత్యంత శక్తివంతమైన ఐటీ బ్రాండ్ టీసీఎస్
♦ ఎంపిక చేసిన బ్రాండ్ ఫైనాన్స్
♦ ఉద్యోగుల వల్లే ఈ ఘనత: టీసీఎస్ సీఈఓ
లండన్: ఐటీ సర్వీసుల్లో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన బ్రాండ్‌గా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్)నిలిచింది. అంతర్జాతీయ ప్రముఖ బ్రాండ్ వేల్యూయేషన్ కంపెనీ బ్రాండ్ ఫైనాన్స్ రూపొందించిన 2016 వార్షిక జాబితాలో తమకు ఈ ఘనత దక్కిందని టీసీఎస్ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా వేలాది బ్రాండ్లను పరిగణనలోకి తీసుకొని ఈ జాబితాను బ్రాండ్ ఫైనాన్స్ తయారు చేసింది.
నిబద్ధత, ఉద్యోగుల సంతృప్తి, కార్పొరేట్ పేరు, ప్రఖ్యాతులు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని రూపొందించిన ఈ జాబితాలో 78.3 పాయింట్ల స్కోర్‌తో, ఏఏప్లస్ రేటింగ్‌తో అగ్రస్థానంలో నిలిచామని టీసీఎస్ పేర్కొంది. అన్నిరంగాల పరంగా చూస్తే అత్యంత శక్తివంతమైన బ్రాండ్‌గా డిస్ని, అత్యంత విలువైన బ్రాండ్‌గా ఆపిల్ నిలిచాయని తెలిపారు. గత ఆరేళ్లలో అత్యంత వేగంగా వృద్ధి చెందిన బ్రాండ్‌గా కూడా టీసీఎస్ నిలిచింది. 2010లో 234 కోట్ల డాలర్లుగా ఉన్న టీసీఎస్ బ్రాండ్ విలువ ఈ ఏడాది 940 కోట్ల డాలర్లకు పెరిగింది. ఇక తమ కంపెనీలోని 3,44,000 మంది ఉద్యోగుల కృషి ఫలితంగానే అగ్రస్థాయి ఐటీ కంపెనీగా ఎదిగామని టీసీఎస్ సీఈఓ, ఎండీ, ఎన్. చంద్రశేఖరన్ చెప్పారు.