త్వరలో అంగన్వాడీ పోస్టుల భర్తీ
ఆలూరు రూరల్ : రాయలసీమ జిల్లాల్లో ఖాళీగా ఉన్న అంగన్వాడీ పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నట్లు మాతాశిశు సంరక్షణశాఖ ఆర్జేడీ శారద తెలిపారు. సోమవారం ఆమె ఆలూరు మండల పరిధిలోని ఆలూరు-02, పెద్దహోతూరు, హాలహర్వి మండల పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. కర్నూలు జిల్లాలో 100 అంగన్వాడీ కార్యకర్తలు, 191 ఆయాలు, 10 మినీ అంగన్వాడీ కార్యకర్తల పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. త్వరలో జిల్లా ఐసీడీఎస్ పీడీ ముత్యాలమ్మ ఆదేశాల మేరకు ఆయా ప్రాజెక్టుల అధికారులు ఖాళీల వివరాలను ప్రకటిస్తారన్నారు. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.
రాయలసీమ జిల్లాల్లో దాదాపు 600కు పైగా అంగన్వాడీ కేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయని, త్వరలో వాటన్నింటికీ పక్కా భవనాలు నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.అంగన్వాడీ సేవలను పూర్తిగా ఆన్లైన్లో నమోదు చేస్తామన్నారు. పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న గర్భిణులు, చిన్నారుల వివరాలను కూడా ఆన్లైన్లో పొందుపరుస్తూ వారి ఆరోగ్యాల పరిరక్షణ కోసం తగిన పౌష్టికాహారాన్ని అందించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
అంగన్వాడీ కేంద్రాల్లో యుక్త వయస్సు కలిగిన బాలికలకు పౌష్టికాహారాన్ని అందించేందుకు కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. త్వరలో ఆయా గ్రామాల్లో యుక్త వయస్సు కలిగిన బాలికల వివరాలను కూడా అంగన్వాడీ కార్యకర్తలు సేకరిస్తారన్నారు. పుట్టిన పిల్లలందరికీ టీకాలు వేసే కార్యక్రమాన్ని కూడా అంగన్వాడీ కార్యకర్తలే చూసుకోవాల్సి ఉందన్నారు. అంగన్వాడీ కేంద్రాలు, పల్లెల్లో ప్రథమ చికిత్సకు అవసరమైన మందులను అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఆరోగ్య సేవలను అందించే విషయంలో అంగన్వాడీ సిబ్బంది నిర్లక్ష్యం చేస్తే తగు చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. సీడీపీఓ కోటేశ్వరి, ఏసీడీపీఓ లలిత తదితరులు ఆమె వెంట ఉన్నారు.