తల్లీ కొడుకులను కాల్చి చంపారు
రాజౌరి: జమ్మూకాశ్మీర్లో దారుణం చోటుచేసుకుంది. వీడిసీ (గ్రామీణ రక్షణ కమిటీ) సభ్యుల అరాచకాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఓ వీడిసీ చేతిలో ఓ తల్లి, ఆమె కుమారుడు దారుణ హత్యకు గురయ్యారు. అందరూ చూస్తుండగానే ముస్తాఖ్ అహ్మద్ అనే వీడీసీ సభ్యుడు.. షమిమా అక్తర్ అనే మహిళ, ఆమె మూడేళ్ల బాబు తాహిద్ పై నేరుగా తుపాకీ ఎక్కుపెట్టి కాల్పులు జరిపాడు. దీంతో ఆ తల్లి కుమారులు ప్రాణాలు కోల్పోయారు. అతడు ఈ హత్య ఎందుకు చేశాడనే వివరాలు మాత్రం తెలియరాలేదు.
ప్రస్తుతం పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. హత్యకు గురైన షమిమా భర్త గత కొన్నేళ్లుగా సౌదీ అరేబియాలోనే పనిచేస్తున్నాడు. ఈ వారంలోనే అంతకుముందు నేషనల్ కాన్ఫరెన్స్ యూత్ నాయకుడు మరో వీడీసీ సభ్యుడి చేతిలో దారుణ హత్యకు గురికాగా ఇది రెండో ఘటన. వీడీసీని పూర్తి స్థాయిలో రూపుమాపాలని గత కొంతకాలంగా పలు నేషనల్ కాన్ఫరెన్స్ తో సహా పలు పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. పోలీసులుగానీ, సైన్యంగానీ అందుబాటులో లేని గ్రామాలకు ఆ గ్రామంలోనే కొందరి వ్యక్తులకు ప్రత్యేక శిక్షణ ఆయుధాలు ఇచ్చి గ్రామానికి రక్షణగా పెడుతుంటారు. వీరినే వీడీసీలు అంటారు.