మన్మోహన్కు గబ్బిలాల స్వాగతం
న్యూఢిల్లీ: పదేళ్లు ప్రధానిగా పనిచేసిన మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ చేతిలో కీలుబొమ్మలా వ్యవహరించారనే అపవాదు మూటగట్టుకున్నారు. ఇప్పుడు ఘోర పరాజయంతో అధికారం పీఠం నుంచి నిష్ర్కమించారు. ఇకమీదట కాంగ్రెస్ నాయకులే ఆయనను పెద్దగా పట్టించుకోకపోవచ్చు. అయితే అధికారం నివాసం ఖాళీ చేసి మరో బంగ్లాకు మారబోతున్న మన్మోహన్కు ఊహించని స్వాగతం లభించనుంది.
సోమవారం మోతీలాల్ నెహ్రూ రోడ్డులోని మూడో నెంబర్ బంగ్లాకు మారుతున్న మన్మోహన్కు వందలాది పక్షులు, గబ్బిలాలు స్వాగతం పలకనున్నాయి. మూడెకరాల విస్తీర్ణంలో రకరకాల చెట్లు, వివిధ జాతుల పక్షులు, గబ్బిలాలు, ఆవులతో కూడిన పచ్చటి వాతావరణం మధ్య ఈ బంగ్లా ఉంటుంది. జామ, మామిడి వంటి పండ్ల చెట్లు, 60 రకాల పక్షులు ఉన్నాయి. మన్మోహన్కు ఈ బంగ్లాను సిద్ధం చేసినట్టు అధికారులు చెప్పారు.