ముందుగా కదిలితేనే
ఏళ్లు గడుస్తున్నా.. ఇందూరుకు మాత్రం కొత్తరైళ్లు రావడం లేదు. ఎన్నో బడ్జెట్లు దాటిపోయినై.. కానీ మన జిల్లాలో రైలు కూత పెట్టడం లేదు. పెద్దపల్లి-నిజామాబా ద్ రైల్వేలైన్ కథ.. ఒక్కటి చాలు మన జిల్లాకు రైల్వేశాఖ చేస్తున్న న్యాయం గురించి చెప్పొచ్చు. కొత్త రాష్ట్రంలోనైనా కొత్త రైళ్లు రావాలని జిల్లాజనం కోరుతున్నారు.
రైల్వేబడ్జెట్‌లో జిల్లాకు ప్రాధాన్యం
- లేదంటే.. మళ్లీ నిధుల్లో కోతే
-మొక్కుబడిగా స్పందిస్తే లాభం లేదు
- ఈసారైనా రైల్వేలైన్లు పూర్తవ్వాలె..
- కొత్త రాష్ట్రంలో ‘కూత’ పెట్టాలె..
- ఎంపీలు కవిత, బీబీపాటిల్‌పై జిల్లావాసుల ఆశలు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : కొత్త రాష్ట్రంలోనైనా రైలుకూత వినిపించాలని జిల్లావాసులు కోరుకుంటున్నారు. ఎన్నోఏళ్లుగా కలగానే మిగిలిన రైల్వేలైన్లు పూర్తికావాలని ఆశిస్తున్నారు. కేంద్రంలో కూడా నరేంద్రమోడీ సారథ్యంలో కొత్తసర్కారు కొలువుతీరింది. కనుక ఈసారి రైల్వేబడ్జెట్‌లో జిల్లాకు వరాలు కురవాలంటే మన ఎంపీలు ఇప్పటి నుంచే ఆ దిశగా దృష్టిసారించాలి. గతంలో సకాలంలో స్పందించక పోవడం.. మొక్కుబడిగా ప్రతిపాదనలు పంపడంతో జిల్లా చాలా నష్టపోయింది. రైల్వేబడ్జెట్లలో అంతంత మాత్రమే నిధులు మంజూరయ్యాయి. వచ్చేనెల 7నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
గత ప్రభుత్వం ఆమోదించిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ జూలై 31 పూర్తికానుంది. ఈ నేపథ్యంలో జూలై 8న మోడీ సర్కారు రైల్వేబడ్జెట్ ప్రవేశపెట్టనుంది. వచ్చేనెల 9న ఆర్థిక సర్వే, 10న సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణకు ఈ బడ్జెట్ చాలా కీలకం కానుంది. ప్రధానంగా రైల్వేబడ్జెట్‌పై ఇప్పటికే కసరత్తు మొదలు పెట్టినట్లు ఆ శాఖ మంత్రి సందానందగౌడ ప్రకటించారు. గతంలో అనేకమార్లు రైల్వేబడ్జెట్‌లు ప్రవేశపెట్టినా జిల్లాకు నిధుల కేటాయింపు తక్కువే. ఇంకా పూర్తికావల్సిన పనులు కూడా చాలా ఉన్నాయి.
కేంద్రంపై ఒత్తిడి తేవాలి
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత మొదటిసారిగా కేంద్రం రైల్వేబడ్జెట్ ప్రవేశపెడుతున్నందున్న మన ఎంపీలు జిల్లా అవసరాలపై దృష్టి సారించాల్సి ఉంది. నిజామాబాద్, జహీరాబాద్ ఎంపీలు కల్వకుంట్ల కవిత, భీంరావ్ బస్వంత్‌రావు పాటిల్‌లతో పాటు ఢిల్లీలోని మన రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి ఎస్.వేణుగోపాలచారి కేంద్రంపై ఇప్పటి నుంచే ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది.
రైల్వేబడ్జెట్ విషయంలో ఏమాత్రం ఏమరుపాటు ప్రదర్శించినా మన వాటాకు కోతలు పడే అవకాశం ఉంది. గతంలో పలుమార్లు ఇలాంటి అనుభవమే జిల్లాకు ఎదురైంది. ఏళ్ల తరబడి కొనసాగుతున్న నిధుల కోతకు ఈసారైనా తెరపడి.. నిధుల మోత మోగాలని జిల్లా ప్రజలు ఆశిస్తున్నారు. ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కారమయ్యేలా ఎంపీల ప్రతిపాదనలు ఉండాలని సూచిస్తున్నారు.
ప్రతిసారీ ప్రతిపాదనలు బుట్టదాఖలే..!
రైల్వే బడ్జెట్ ప్రవేశపట్టిన ప్రతీసారి ఆశతో ఎదురుచూసే జిల్లావాసులకు నిరాశే మిగులుతోంది. ఇంతకు ముందున్న జిల్లా ఎంపీలు మధుయాష్కీ, సురేశ్ శెట్కార్ పలు ప్రతిపాదనలను చేసినా అవి బుట్టదాఖలయ్యాయి. 2013-14 బడ్జెట్లో వీరు చేసిన ప్రతిపాదనల్లో ఆర్మూర్-ఆదిలాబాద్ వరకు కొత్త రైల్వేలైన్ వేయటానికి గ్రీన్‌సిగ్నల్ లభించినప్పటికీ ఆ బడ్జెట్లో తగినన్ని నిధులను మాత్రం కేటాయించలేదు. ఆ రైల్వేలైన్ ప్రతిపాదనల వరకే పరిమితమైంది.
బోధన్-బీదర్ లైన్, ఆర్మూర్-నిర్మల్-ఆదిలాబాద్లైన్లను పూర్తిగా మరిచిపోయి.. జిల్లావాసులను నిరాశకు గురి చేశారు. సరుకు రవాణా భారం తగ్గించకపోగా మరింత పెంచి, ఆదర్శ స్టేషన్ల అభివద్ధికి పైసా కూడా విదిల్చలేదు. నిజామాబాద్, కామారెడ్డి రైల్వేస్టేషన్లను ఆదర్శ రైల్వేస్టేషన్లుగా ప్రకటించి ఎనిమిదేళ్లు గడుస్తున్నా.. ఇప్పటికీ ఆధునికీకరించిన దాఖలాలు లేవు. కొత్త ప్యాసింజర్ రైళ్ల ప్రతిపాదనలకు ప్రతీసారి మొండిచెయ్యే చూపుతున్నారు.
పాతలైన్ల పూర్తి.. కొత్త రైళ్లపై దృష్టి
2013-14 రైల్వే బడ్జెట్ జిల్లాకు కొంత మోదం.. మరికొంత ఖేదం మిగల్చగా.. ఈ ఏడాది ఫిబ్రవరి 13న కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో జిల్లా ఊసే లేదు. పెద్దపల్లి - నిజామాబాద్ రైల్వేలైను మోర్తాడ్ వరకే వచ్చింది. ఈ పనులు 2014 మార్చి వరకు పూర్తి చేస్తామని ప్రకటించినా పెండింగ్‌లోనే ఉన్నాయి. ఆర్మూర్-నిర్మల్-ఆదిలాబాద్ కొత్త రైల్వేలైన్ ప్రతిపాదనకు మోక్షం కలగడం లేదు. 2013-14 బడ్జెట్లో సికింద్రాబాద్ నుంచి నిజామాబాద్ మీదుగా బాసర, ముథ్కేడ్, ఆదిలాబాద్ వరకు డబుల్ లైన్ మంజూరు చేసినా అరకొర నిధులతోనే సరిపుచ్చారు.
నిజామాబాద్-ముంబయి వరకు వేసిన ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఇప్పటికీ ఆశాజనకంగా లేవు. జిల్లా వ్యవసాయ, పారిశ్రామిక, వ్యాపార అభివద్ధికి ప్రధానమైన ఈ కొత్త రైల్వేలైన్ల పనులకు ఈసారైనా తుదిరూపు తీసుకు రావాల్సిన అవసరం ఉంది. బోధన్-మిర్జాపల్లి ప్యాసింజర్ మూడు బోగీలతోనే ముక్కి.. ముక్కి.. నడుస్తోంది. దీని బోగీల సంఖ్య పెంచాలని చాలాకాలంగా జిల్లావాసులు డిమాండ్ చేస్తున్నారు. జిల్లాలోని రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ, రైల్వేఓవర్ బ్రిడ్జీలు, ఫుట్ఓవర్ బ్రిడ్జీల నిర్మాణం, రైల్వే అభివృద్ధి కోసం తక్షణమే బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయించేలా ఎంపీలు కృషి చేయాల్సిన అవసరం ఉంది.
వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని కొత్తగా ఎంపికైన పార్లమెంట్ సభ్యులు కవిత, బీబీపాటిల్‌లు తాజా ప్రతిపాదనలతో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. వచ్చేనెలలోనే రైల్వేబడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ముందస్తుగా ప్రతిపాదనలు ప్రభుత్వానికి సమర్పించాలంటున్నారు.