కొత్త వైద్యులొచ్చారు..
ఆదిలాబాద్ టౌన్, న్యూస్‌లైన్ : జిల్లాలో కొత్త వైద్యులు కొలువు తీరారు. ఆయా పీహెచ్‌సీల్లో వైద్యుల కొరతను దృష్టిలో ఉంచుకొని వైద్య పోస్టులు భర్తీ చేసేందుకు ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగానే సోమవారం 24 మంది మెడికల్ ఆఫీసర్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఎం.స్వామిని కలిసి రిపోర్టు చేశారు.
వీరందరూ మంగళవారం నుంచి విధుల్లో చేరనున్నారు. ఆదిలాబాద్‌లోని డీఎంహెచ్‌వో చాంబర్లో నూతనంగా ఎంపికైన మెడికల్ ఆఫీసర్స్‌కు సోమవారం పోస్టింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులను భర్తీ చేసే ప్రక్రియ మొదలు పెట్టిందన్నారు. నూతనంగా ఎంపికైన వైద్యులు పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా కృషి చేయాలన్నారు.