‘ముద్ర’ రుణాలతో నేతన్నల ఆర్థికాభివృద్ధి
► పవర్లూం సొసైటీలు ఏర్పాటుచేసుకోవాలి
► ఆర్బీఐ లీడ్ ఆఫీసర్ అలోక్రంజన్ రాణారాహుల్
► సిరిసిల్ల ఆసాములతో సమావేశం
సిరిసిల్ల : నేతన్నల ఆర్థికాభివృద్ధికి ముద్ర రుణాలు దోహదపడుతాయని ఆర్బీఐ లీడ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అకోల్ రంజన్ రాణారాహుల్ అన్నారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో పవర్లూం ఆసాములతో మంగళవారం సమావేశం నిర్వహించారు. సిరిసిల్ల నేత కార్మికులకు వస్త్రోత్పత్తిలో నైపుణ్యం ఉందని, పవర్లూమ్స్పై మార్కెట్లో డిమాండ్ ఉన్న వస్త్రాన్ని ఉత్పత్తి చేయాలన్నారు. బ్యాంకుల ద్వారా తీసుకున్న ముద్ర రుణాలను సద్వినియోగం చేసుకోవాలని, పెట్టుబడులకు వినియోగించుకోవాలని సూచించారు. పవర్లూం ఆసాములు సొసైటీలుగా రిజిస్టర్ చేయించుకుని బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకోవచ్చన్నారు. రూ.50 వేల నుంచి రూ.పది లక్షల వరకు రుణాల తీసుకుని వస్త్రోత్పత్తి రంగాన్ని విస్తరించాలని సూచించారు.
బ్యాంకుల నమ్మకాన్ని ఆసాములు పోగొట్టుకోవద్దని కోరారు. జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ డీఏ.చౌదరి మాట్లాడుతూ సిరిసిల్లలో 1300 కుటుంబాలకు రుణాలిచ్చేందుకు బ్యాంకులు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. సరైన డాక్యుమెంట్లతో దరఖాస్తులు చేసుకున్న వారికి తప్పకుండా రుణాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. బ్యాంకుల్లో డాక్యుమెంటేషన్ పూర్తయితే రుణమేళా నిర్వహిస్తామని జౌళిశాఖ అధికారులు తెలిపారు. సమావేశంలో ఆసాముల సంఘం నాయకులు దాసరి వెంకటేశం, కొండ ప్రతాప్, వేముల దామోదర్, జౌళిశాఖ కమ్యునిటీ ఫెసిలిటేటర్లు పాల్గొన్నారు. అంతకు ముందు ఆర్బీఐ అధికారులు స్థానిక బ్యాంకులను సందర్శించి ముద్ర రుణాలపై సమీక్షించారు.