వైభవోపేతంగా పెద్దదర్గా ఉరుసు
కడప కల్చరల్ : పెద్దదర్గా ఉరుసు శనివారం వైభవోపేతంగా నిర్వహించారు. నూతనంగా నిర్మించిన ముషాయిరా హాలులో ఇదారే అమినియా చిష్ఠియా నివేదిక సమర్పణ కార్యక్రమం నిర్వహించారు. దర్గా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పలు సేవా సంస్థల కార్యక్రమాల వివరాలను ఆయా సంస్థల ప్రతినిధులు కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పీఠాధిపతి హజరత్ సయ్యద్‌షా ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్‌కు సమర్పించారు. ఆయన వాటికి ఆమోదం తెలిపారు. దర్గా ప్రాంగణంలో పీఠాధిపతి ఆధ్వర్యంలో ఆషారే షరీఫ్ దర్శనం చేయించారు. స్థానిక ప్రముఖులు, ఖలీఫాలు, ఫకీర్లు, చౌదరీలు ఆసారే షరీఫ్‌ను తిలకించి భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు చేశారు. రాత్రి కడప నగరం మార్కెట్‌కు చెందిన వస్త్ర వ్యాపారులు పూల చాందినీని ఊరేగింపుగా తీసుకు రాగా బజారుకు చెందిన ఎద్దుల బండ్ల చౌదరీలు, ఖలీఫాలు చాందిని, గంధం కలశాన్ని బ్యాండు మేళాలతో ఊరేగింపుగా దర్గాకు చేర్చారు. పీఠాధిపతి వాటితో దర్గా గురువుల మజార్ వద్ద ప్రార్థనలు చేపట్టారు. అనంతరం ముషాయిరా హాలులో ప్రముఖ ఖవ్వాలీ గాయకులచే కచేరీ ఉత్సాహ భరితంగా నిర్వహించారు.
చాదర్‌తో కలెక్టర్..
జిల్లా కలెక్టర్ కేవీ సత్యనారాయణ ఉరుసు సందర్భంగా దర్గాలో పవిత్ర చాదర్ సమర్పించారు. వన్‌టౌన్ కూడలిలో దర్గా ప్రతినిధులు తెచ్చిన చాదర్‌ను ఆయన తలపై ఉంచుకుని వైవీ స్ట్రీట్ ద్వారా దర్గాకు చేరుకున్నారు. ఫకీర్లు సాహస విన్యాసాలతో ఆయన వెంట సాగారు. అనంతరం దర్గాలోని ప్రధాన గురువుల మజార్ వద్ద చాదర్ సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.