రాంనగర్లో మహిళ హత్య
రాంనగర్లో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. ప్రియుడే ఈ ఘాతుకానికి ఒడిగట్టి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అతని కోసం మూడు బృందాలను రంగంలోకి దింపారు. ముషీరాబాద్ ఇన్స్పెక్టర్ శ్యాంసుందర్ కథనం మేరకు.. ఆటోడ్రైవర్ దుర్గేశ్ భార్య, పిల్లలతో కలిసి రాంనగర్లో నివాసముంటున్నాడు. అప్పుడప్పుడు పోతురాజుగా, కూలీగా కూడా పని చేసే వాడు. కాగా, అతడు మౌనిక (36) అనే మహిళతో కలిసి రాంనగర్ డివిజన్ మేదర బస్తీలో విజయభారతి పాఠశాల సమీపంలోని గొల్ల సంధయ్య ఇంట్లో ఇరవై రోజుల క్రితం అద్దెకు దిగాడు.
మంగళవారం ఉదయం ఇంటి పక్కనే నివసమించే షమీన, తలుపు తట్టగా ఎంతకీ సమాధానం రాలేదు. ఆమె గట్టిగా నెట్టడంతో తలుపు తెరుచుకోగా, గదిలో మౌనిక నేలపై పడి ఉంది. దీంతో స్థానికులు పోలీసులు సమాచారమందించారు. వారు వచ్చి చూడగా, ఆమె అప్పటికే మృతి చెందింది. గొంతు చుట్టూ నల్లగా కమిలిపోయి ఉంది. సమీపంలోనే విద్యుత్ వైర్ లభించింది. వైర్‌తో బిగించి చంపి ఉంటారని అనుమానిస్తున్నారు. రోజూ దుర్గేశ్, మౌనిక కలిసి మద్యం తాగి ఘర్షణకు దిగే వారని చుట్టుపక్కల వారు తెలిపారు. ఈ క్రమంలోనే అతడే ఈ దారుణానికి పాల్పడి ఉంటాడని అనుమానిస్తున్న పోలీసులు మూడు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించిన పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే మౌనిక దుర్గేష్‌కు రెండో భార్యా? లేక ఆమెతో సహజీవనం చేస్తున్నాడా? అన్న విషయం తెలియాల్సి ఉంది.