నేనూ ఎంజాయ్ చేస్తున్నా
తమిళనాడులో పుట్టి అమెరికాలో పెరిగి, మోడలింగ్‌లో అడుగిడి, నటిగా రాణిస్తున్న నటి ప్రియాఆనంద్. వామనన్ చిత్రం ద్వారా హీరోయిన్గా కోలీవుడ్‌కు పరిచయమైన ఈ బ్యూటీ ఆ తరువాత అరిమా తంబి, ఇరుంబు కుదిరై, వైరాజావై చిత్రాలతో వేగంగా ఎదుగుతూ వచ్చిన ప్రియాఆనంద్ అనూహ్యంగా వెనుక పడింది. చాలా గ్యాప్ తరువాత ముత్తురామలింగం అనే చిత్రంలో నటిస్తోంది. ఈ సందర్భంగా ఈ ముద్దుగుమ్మతో చిన్న భేటీ..
ప్ర: మధ్యలో మిమ్మల్ని కోలీవుడ్ దూరం పెట్టినట్లుందే?
జ:నేనలా భావించడం లేదు. నిజం చెప్పాలంటే హీరోయిన్ హీరోను ప్రేమిస్తూ తన చుట్టూ చెట్లు, గుట్టలు తిరుగుతూ పాటలు పాడే పాత్రలు చేసి బోర్ కొట్టింది. చెబితే నమ్మరు గానీ అలాంటి పలు అవకాశాలను నేను నిరాకరించాను. అయినా ఇప్పుడు నేను నటిగా బిజీగానే ఉన్నాను. ఎస్రా అనే చిత్రం ద్వారా తొలి సారిగా మలయాళ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టాను.అందులో పృథ్వీరాజ్‌కు జంటగా నటిస్తున్నాను.అదే విధంగా రాజకుమారా అనే కన్నడ చిత్రంలో పునీత్‌రాజ్‌కుమార్ సరసన నటిస్తున్నాను.తమిళంలో ముత్తురామలింగం చిత్రం చేస్తున్నాను. నేను ఇంటి ముఖం చూసి 45 రోజులైంది.
ప్ర: ముత్తురామలింగం చిత్రంలో మీ పాత్ర గురించి?
జ: ఇందులో తొలిసారిగా గ్రామీణ యువతిగా నటిస్తున్నాను. నన్ను అందరూ అమెరికా రిటర్న్ అమ్మాయిగానే చూస్తున్నారు. నిజానికి నాలో ఉన్నది గ్రామీణ యువతినే. ఇప్పటికీ సొంత ఊరికి వెళితే స్వర్గానికి వచ్చినట్లు ఫీల్ అవుతాను.నేను ఇష్టపడే పాత్ర ఇన్నాళ్లకు లభించింది.
ప్ర:నటుడు గౌతమ్‌కార్తీక్ కోసమే ముత్తురామలింగం చిత్రాన్ని అంగీకరించారనే ప్రచారం గురించి మీ స్పందన?
జ: నిజం అదికాదు. ఇంకా చెప్పాలంటే ఆయన తండ్రి కార్తీక్ కోసం ఈ చిత్రంలో నటించడానికి ఒప్పుకున్నాను. ఇందులో ఆయన ఒక ముఖ్య పాత్రలో నటించాల్సిఉంది. నేను చిన్నతనం నుంచి నటుడు కార్తీక్, శ్రీదేవిల వీరాభిమానిని. శ్రీదేవితో కలిసి నటించాను. ఇక కార్తీక్‌తో నటిస్తే నా ఆశ నేరవేరుతుందని ముత్తురామలింగం చిత్రంలో నటించడానికి అంగీకరించాను.అయితే కొన్ని కారణాల వల్ల చివరి నిమిషంలో కార్తీక్ నటించలేకపోయారు.
ప్ర:సరే గౌతమ్‌కార్తీక్‌తో ప్రేమ అంటూ జరుగుతున్న ప్రచారం గురించి ఏమంటారు?
జ: మొదట్లో నాపై ప్రేమ వదంతులు ప్రసారం అయిన ప్పుడు చాలా బాధ కలిగేది. ఇలా రాస్తున్నారేమిటని చింతించేదాన్ని. సినిమాకు వచ్చి ఏడేళ్లు దాటింది. అందరిలా నేనూ అలాంటి వార్తలను ఎంజాయ్ చేయడం అలవాటు చేసుకున్నాను.