మహిళ అనుమానాస్పద మృతి
దేవరకద్ర: ఓ మహిళ అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన సంఘటన సోమవారం దేవరకద్రలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. స్థానిక ఆర్అండ్బీ అతిథిగృహంలో వాచ్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్న అమీనాబీకి కొడుకు అబ్దుల్‌ఖాదర్ ఉన్నాడు. అతడికి రిజ్వానాబేగం(35) వివాహమైంది. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆదివారం పిల్లలతో కలిసి వనపర్తికి వెళ్లిన రిజ్వానాబేగం, అబ్దుల్‌ఖాదర్ తిరిగి రాత్రి కౌకుంట్లకు చేరుకుని అక్కడే ఉన్నారు. సోమవారం ఉదయం పిల్లలు స్కూలుకు వెళ్లిన తరువాత రిజ్వానాబేగం ఇంట్లోనే నిద్రకు ఉపక్రమించింది.
భర్త మంచంపై పడుకున్నాడు. ఒంటిబడులు కావడంతో మధ్యాహ్నం పిల్లలు ఇంటికి వచ్చేసరికి తల్లి విగతజీవిగా పడిఉంది. ఈ విషయాన్ని ఆ చిన్నారులు పక్కింటివారి ఫోన్‌తో మేనమామ బాబ్జాన్కు చెప్పారు. తరుచూ భార్యను వేధించే అబ్దుల్‌ఖాదర్ హత్యచేసి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేసి పోలీసులకు ఫిర్యాదుచేశారు. విచారించిన పోలీసులు ఆత్మకూర్ సీఐ ప్రభాకర్‌రెడ్డి, ఎస్ఐ వినయ్‌కుమార్‌రెడ్డి వివరాలు తెలుసుకున్నారు. రిజ్వానాబేగం గొంతుచుట్టు బిగించినట్లు ఎర్రని చారలు కనిపించాయి. కుటుంబసభ్యుల ఫిర్యాదుమేరకు అనుమానాస్పదస్థితి కేసుగా నమోదుచేశారు. భర్త అబ్దుల్‌ఖాదర్, అత్త అమీనాబీని పోలీసులు విచారణ చేస్తున్నారు.