సీఎం పర్యటన ఖరారు
చోడవరం,న్యూస్‌లైన్: చోడవరంలో ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి రచ్చబండ కార్యక్రమం ఖరారుతో జిల్లా అధికారులు ఏర్పాట్లులో నిమగ్నమయ్యారు. నియోజకవర్గం పరిధిలోని నాలుగు మండలాలకు ఒకేచోట సభ నిర్వహణకు మంత్రులు, జిల్లాస్థాయి అధికారులు ఏకంగా రెండ్రోజుల నుంచి ఇక్కడే మకాం వేసి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. ముందస్తు షెడ్యూల్ ప్రకారం ఈనెల 12, 13తేదీల్లో నాలుగు మండలాల్లోనూ రోజుకి రెండు చొప్పున రచ్చబండ సభలు నిర్వహించాలని నిర్ణయించారు.
కానీ సీఎం వస్తున్నందున ఏకంగా నాలుగు మండలాలకు ఒకే రోజు, ఒకే చోట ఈ నెల 15న సభ ఏర్పాటు చేశారు. ఆరోజు ఉదయం 7.30 గంటలకు న్యూఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఉదయం 10 గ ంటలకు విశాఖ విమానాశ్రయానికి సీఎం చేరుకుంటారు.
ఉదయం 10.15 గంటలకు హెలికాప్టర్లో 10.45 గంటలకు చోడవరం వస్తారు. ఇక్కడి ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో జరిగే రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటారు. బహిరంగ సభలో ప్రసంగిస్తారు. నియోజకవర్గం పరిధిలో ఫింఛన్లు 3,080 మందికి, రేషన్‌కార్డులు 5వేలు, బంగారు తల్లి పథకం 151, వడ్డీలేని రుణాలు 4,270 మంది, ఎస్సీ,ఎస్టీసబ్‌ప్లాన్ పథకంలో 1774 కుటుంబాలకు పథకాలు పంపిణీ చేస్తారు. సభ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఆరోఖ్యరాజ్, పోలీసు సూపరింటెండెంట్ విక్రమ్‌జిత్‌దుగ్గల్ బుధవారం పరిశీలించారు.
విజయవంతానికి తీసుకోవాల్సిన చర్యలపై ఆయా శాఖల అధికారులతో సమీక్షించారు. ల క్ష్మీపురం రోడ్డులో హెలిప్యాడ్ ప్రదేశాన్ని, రచ్చబండ సభ ఏర్పాటు చేస్తున్న కళాశాల గ్రౌండ్‌ను పరిశీలించారు. సభ విజయవంతానికి పెద్దసంఖ్యలో లబ్ధిదారులను తరలించాలని నాలుగుమండలాల అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం సబ్‌కలెక్టర్ స్వేత తియోతియా, చోడవరం ఎమ్మెల్యే కెఎస్ఎన్ఎస్ రాజు, డీసీసీ అధ్యక్షుడు కరణం ధర్మశ్రీ, ఆర్అండ్బి సూపరింటెండె ంట్ ఇంజనీర్ కాంత్, సీఈఓ వెంకటరెడ్డి, ఆర్డీఓ వంతరాయుడు, చోడవరం తహాశీల్దార్ శేషశైలజ పాల్గొన్నారు.