రుణభారంతో రైతు బలవన్మరణం
వర్గల్(మెదక్): అప్పుల బాధతో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మెదక్ జిల్లా వర్గల్ మండలం పాతూరుకు చెందిన చెట్టి నాగరాజు (27) తన ఎకరంలో సాగు చేసుకుంటూనే కూలీ పనులకు వెళుతుంటాడు. గతంలో సాగు నీటి కోసం దాదాపు రూ.లక్ష అప్పు తెచ్చి మూడు బోర్లు తవ్వించినప్పటికీ ఫలితం దక్కలేదు. తాజాగా వర్షాధారంగా ఎకరం విస్తీర్ణంలో రూ.6,500 వేలు అప్పు తెచ్చి పత్తి పంట వేశాడు. వర్షాభావం అలుముకోవడంతో అది సరిగా ఎదగలేదు.
అప్పు ఇలా పెరిగిపోతుండగా.. మరోవైపు గర్భిణి అయిన భార్యను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు నాలుగు రోజులుగా అప్పు కోసం చేసిన ప్రయత్నమూ ఫలించలేదు. శుక్రవారం భార్యను ఆసుపత్రిలో చేర్పించాలని వైద్యులు చెప్పడంతో గురువారం డబ్బు కోసం ప్రయత్నించినా దొరకలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. రాత్రి 9 గంటలకు ఇంటికొచ్చిన నాగరాజు అన్నం తినకుండానే పొలానికి నీరు పెట్టి వస్తా అని తల్లికి చెప్పి అదే రాత్రి పొలంలోనే పురుగు మందు తాగి విగత జీవిగా మారాడు.