కాల్‌మనీ కేసులో బాధితుల ఆత్మహత్యాయత్నం
కాల్ మనీ కేసులో రుణదాతపై చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తూ... గుంటూరు జిల్లా రేపల్లె పట్టణంలో ఇద్దరు మహిళలు సోమవారం ఆత్మహత్యాయత్నం చేసుకోబోయారు. స్థానికంగా ఆరో వార్డులో ఉద్రిక్తతకు దారితీసిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఆరో వార్డుకు చెందిన పొదిలి సత్యనారాయణఅనే ఫైనాన్షియర్ నుంచి... ఏకలవ్య కాలనీకి చెందిన దాసరి వెంకట నాగేశ్వరమ్మ, సజ్జా రజనికొన్నేళ్ల క్రితం అప్పు తీసుకున్నారు.
నాగేశ్వరమ్మ రనూ.1.5 లక్షలు తీసుకోగా... ఇప్పటి వరకు రూ.4 లక్షలను వడ్డీ రూపంలో చెల్లించింది. రజని కూడా సుమారు రూ.లక్ష అప్పుగా తీసుకుని... గత మూడేళ్ల నుంచి ప్రతి నెలా రూ.5వేలు చొప్పున చెల్లిస్తోంది. అయినా ఇంత వరకు అసలు తీరలేదు. ఇదే విషయమై సత్యానారాయణ వారిని వేధింపులకు గురిచేయడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీనిపై కోర్టును కూడా ఆశ్రయించారు. అయినా న్యాయం జరగలేదన్న మనస్తాపంతో సోమవారం నాగేశ్వరమ్మ, రజని ఆరో వార్డులోని సత్యానారాయణ ఇంటి వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. వంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నంలో ఉండగా... సీఐ మల్లికార్జునరావు సిబ్బందితో చేరుకుని అడ్డుకున్నారు. న్యాయం చేస్తామని హామీ ఇచ్చి వారిని అక్కడి నుంచి పంపించేశారు.