‘నీరు-చెట్టు’ పేరుతో పొట్టకొట్టొద్దు
పర్చూరు : మూడు తరాలుగా సాగు చేసుకుంటున్న భూములను లాక్కొని ‘నీరు-చెట్టు’ పేరుతో తమ పొట్టకొట్టొద్దంటూ రైతులు పర్చూరు- చీరాల ఆర్అండ్బీ రోడ్డుపై శనివారం రాస్తారోకో చేశారు. నాగులపాలెం గ్రామ పరిధిలోని 352/5 సర్వే నంబర్లోని 22.85 ఎకరాల్లో నీరు- చెట్టు కార్యక్రమంలో భాగంగా కుంట తవ్వేందుకు అధికారులు సర్వేకు బయల్దేరారు. విషయం తెలుసుకున్న 30 కుటుంబాల సాగుదారులు రోడ్డుపై బైఠాయించారు.
ఆదివాసీ సంక్షేమ సంఘం పర్చూరు నియోజకవ ర్గ కమిటీ నాయకులు, రైతులు మాట్లాడుతూ సెంటు భూమి లేని ఎస్సీ, ఎస్టీ, బీసీలు మూడు తరాలుగా సాగు చేసుకుంటున్న భూముల్లో కుంట తవ్వేందుకు నాగులపాలెం పంచాయతీ కనీసం తమకు సమాచారం ఇవ్వకుండా ఏకపక్షంగా తీర్మానం చేసిందని చెప్పారు. జీవనాధారమైన భూములను లాక్కొని పొట్టలు కొట్టొద్దని ఆవేదన వ్యక్తం చేశారు. తమ భూముల్లో కుంటలు తవ్వి మట్టిని అమ్ముకోవాలని చూస్తున్నారని తెలిపారు.
వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి. హనుమంతరావు మాట్లాడుతూ వేల ఎకరాలు కబ్జా చేసినవారి వదిలేసి పేదల భూములు తీసుకోవడం అన్యాయమన్నారు. రాస్తారోకోతో రోడ్డు రాకపోకలు స్తంభించాయి. పోలీసులు సర్ది చెప్పడంతో రాస్తారోకో విరమించారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు.