రైలెక్కితే ఏకంగా అనంత లోకాలకే!
హైదరాబాద్ : అనంతపురం జిల్లాలో ఈ రోజు తెల్లవారుజామున జరిగిన ఘోర రైలు ప్రమాదంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దుర్ఘటనకు రైల్వే శాఖే పూర్తి బాధ్యత వహించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రయాణికులకు భద్రత ఏదంటూ వారు ఆక్రోశం చెందుతున్నారు. ఆధునిక పరిజ్ఞానం అభివృద్ధి చెందినా రైల్వే శాఖ మాత్రం నామమాత్రంగా చర్యలు చేపడుతుందన్నారు. రైలు ఎక్కితే ఏకంగా అనంత లోకాలకే తీసుకు వెళుతున్నారని ప్రయాణికులు మండిపడ్డుతున్నారు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే హడావుడి చేసే రైల్వే శాఖ ఆ తర్వాత....భద్రతపై ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని వారు విమర్శిస్తున్నారు.
కాగా బెంగళూరు నుంచి నాందేడ్ వెళుతున్న రైలు ప్రమాదంపై రైల్వే శాఖ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిర్వహణ లోపం వల్లే ఈ ప్రమాదం జరిగిందని వారు చెబుతున్నారు. రైళ్ల నిర్వహణకు సంబంధించి అవుట్ సోర్సింగ్‌కు ఇవ్వటంతో పాటు, వారికి సాంకేతిక పరిజ్ఞానం ఎలా ఉపయోగించాలో కూడా తెలియదని ఉద్యోగులు అంటున్నారు. తూతూ మంత్రంగా తనిఖీలు చేసి... ప్రయాణికుల భద్రతను పట్టించుకోవటం లేదని చెబుతున్నారు.