లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు కోసం పరుగు
బాలానగర్(జడ్చర్ల) : లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో పేరు సంపాదించేందుకు ఓ యువకుడు పరుగు అందుకున్నారు. వివరాలిలా.. వరంగల్ జిల్లా పరకాల మండలం కుంటఆత్మకూకు చెందిన తిరుపతి(26) హైదరాబాద్‌లోని డెల్ కంపెనీలో సెక్యూరిటీగా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిరోజు ఉదయాన్నే బొటానికల్ గార్డెన్లో రన్నింగ్ ప్రాక్టీస్ చేసేవారు. గమనించిన బాలానగర్‌కు చెందిన నందిటైర్స్ ఎండీ భరత్‌రెడ్డి యువకుడితో ఆరా తీశారు. దీంతో అతను లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సాధించే దిశగా రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తున్నానని, దాతలు సహకరిస్తే గతంలోని 192 కిలోమీటర్స్ రికార్డును అధిగమిస్తానని పేర్కొన్నారు. దీంతో స్పందించిన భరత్‌రెడ్డి తన నందిటైర్స్ సంస్థ ద్వారా అవసరమై సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. దీంతో తిరుపతి ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో అవసరమైన వనరులను సమకూర్చకొని తన పరుగును ప్రారంభించారు. ఓ అంబులెన్స్, సహాయక సిబ్బంది తోడు రాగా బొటానికల్ గార్డెన్ నుంచి ప్రారంభించిన పరుగును బాలనగర్ మండలంలోని నందిటైర్స్ పరిశ్రమ వరకు చేరి 100 కిలోమీటర్లు పూర్తిచేసి ముగించారు.
తిరుపతికి ఘన సన్మానం: పరిశ్రమ ఎండీ స్థానిక నాయకులతో కలిసి తిరుపతిని ఘనంగా సత్కరించారు. తిరుపతి మాట్లాడుతూ 192 కిలోమీటర్లుగా ఉన్న బెంగుళూరుకు చెందిన అరుణ్‌భరద్వాజ్ రికార్డును చెరిపి తన పేరున నమోదు చేసుకునేందుకు కృషిచేస్తున్నానన్నారు. ఇందుకు హైదరాబాద్ నుంచి కేసీఆర్ ఫాంహౌస్ వరకు పరుగుతీసి రికార్డును నెలకొల్పుతానన్నారు. తన తల్లి పక్షవాతం బారిన పడిందని, తండ్రి బీపీతో బాధపడుతున్నాడని తన కుంటుంబాన్ని పోషించే స్థాయిలేని తనకు నందిటైర్స్ ఎండీ ఆర్థికంగా ఆదుకొని ఇంత ప్రోత్సాహాన్ని ఇచ్చారని పేర్కొన్నారు. ఎలాంటి గుర్తింపు లేని తనకు రమేష్ అనే కోచ్‌ను నియమించి ఈ ఘనత సాధించే దిశగా కృషి చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.