nangi devender reddy
-
గల్ఫ్ సమస్యలపై రాహుల్‌కు వివరణ
బహ్రయిన్ : ప్రవాసీ సమ్మేళన్‌ను గ్లోబల్ ఆర్గనైజేషన్ ఆఫ్ పీపుల్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్(గోపియో) ఈ నెల 6 నుంచి 8 వరకూ బహ్రయిన్లో నిర్వహించింది. సమావేశం చివరి రోజైన సోమవారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ సమ్మేళన్‌లో పాల్గొన్నారు. ఏఐసీసీ కార్యదర్శి మధు యాష్కీ, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్, టెలికాం నిపుణుడు శ్యామ్ పిట్రోడా తదితర బృందంతో పాటు, బహ్రయిన్ యువరాజు, ఆర్థిక మంత్రులతో రాహుల్ భేటీ అయ్యారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ గల్ఫ్ ఎన్నారై విభాగం అధ్యక్షులు నంగి దేవేందర్ రెడ్డి రాహుల్ గాంధీని కలిసి 10 లక్షల మంది తెలంగాణ గల్ఫ్ వలస కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. తెలంగాణ గల్ఫ్ వలసలపై ఒక నివేదికను అందజేశారు. గల్ఫ్ దేశాల సహకారమండలి(గల్ఫ్ కోపరేషన్ కౌన్సిల్-జిసిసి)లోని ఆరు దేశాలలో ప్రవాస భారతీయుల జనాభా 87.64 లక్షలు ఉన్నదని చెప్పారు. వీరందరూ ఎన్నారై ఓటర్లుగా ఆన్లైన్లో నమోదు చేసుకోవడానికి ఇండియన్ ఓవర్సిస్ కాంగ్రెస్ కార్యకర్తలు కృషి చేయాలనే ప్రస్తావన వచ్చిందని దేవేందర్ రెడ్డి తెలిపారు. 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ పార్టీ తన ఎలక్షన్ మేనిఫెస్టోలోని పేజీ నెం.22లో 'ప్రవాసుల సంక్షేమం' పేరిట ఇచ్చిన హామీలను గుర్తు చేశారు. గల్ఫ్‌లో మృతి చెందిన వలస కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా, కేరళ తరహాలో జీవిత బీమా, ప్రమాద బీమా, ఆరోగ్య బీమా, పెన్షన్లతో కూడిన పథకం సాధించడానికి రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నామని చెప్పారు. గల్ఫ్ నుంచి తిరిగి వచ్చాక పునరావాసం కొరకు, గల్ఫ్ జైళ్లలో మగ్గుతున్న తెలంగాణ ప్రవాసీలకు న్యాయ సహాయానికి, గల్ఫ్ ప్రవాసీల సంక్షేమం కోసం బడ్జెట్లో ఏటా రూ. 100 కోట్ల నిధులు కేటాయించడానికి, సమగ్ర ఎన్నారై పాలసీ కోసం కాంగ్రెస్ పార్టీ గల్ఫ్ విభాగం పోరాటం చేస్తుందని వివరించారు. -
ఈ నెల 6న ఢిల్లీలో ప్రవాసీ ప్రజావాణి
► ప్రతి నెల మొదటి బుధవారం ఓపెన్ హౌజ్ సాక్షిప్రతినిధి, నిజామాబాద్: విదేశాంగ శాఖ ప్రవాసీల కోసం ప్రతినెలా ప్రవాసీ ప్రజావాణి (బహిరంగ వేదిక)ను నిర్వహించనున్నట్లు తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షులు నంగి దేవేందర్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రొటెక్టర్ జనరల్ ఆఫ్ ఎమిగ్రెంట్స్(పిజిఇ) కార్యాలయంలో ప్రతినెలా మొదటి బుధవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ ప్రవాసీ ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనుందని పేర్కొన్నారు. ఉద్యోగ, ఉపాధి కోసం 18 ఇసిఆర్ దేశాలకు వలస వెల్లదలచిన వారు, ఆయా దేశాల నుంచి తిరిగి వచ్చినవారు తమ సమస్యలను, సందేహాలను వినడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పిజిఇ కార్యాలయం ఢిల్లీలో చాణక్యపురి, అక్బర్ భవన్లో గల ఉంటుందని వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకున్న వారు పిజిఇ కార్యాలయం ఫోన్ నెం. 011 24673965కు గానీ, ఈ–మెయిల్: pge@mea.gov.in కు సంప్రదించవచ్చని తెలిపారు. సలహాలు, సహాయం కోసం తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ అసోసియేషన్ హెల్ఫ్‌లైన్ నెంబర్ 81435 88886 కు కాల్ చేయాలని కోరారు. హైదరాబాద్ వంటి నగరాల్లో కూడా ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆయన కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గల్ఫ్ కోఆపరేటివ్ కౌన్సిల్ (జీసీసీ) సభ్యదేశాలైన సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైట్, బహ్రెయిన్, ఓమాన్, ఖతార్‌తో పాటు ఆప్ఘనిస్తాన్, ఇరాక్, జోర్డాన్, లెబనాన్, లిబియా, మలేసియా, నార్త్ సుడాన్, సౌత్‌సుడాన్, సిరియా, యెమెన్, ఇండోనేసియా, థాయిలాండ్ ఇలా మొత్తం 18 దేశాలను భారత ప్రభుత్వం విదేశాలకు వెళ్లడానికి ప్రభుత్వం అనుమతి అవసరం’ అయిన దేశాలు (ఇ.సి.ఆర్– ఎమ్మిగ్రేషన్ క్లియరెన్స్ రిక్వయిర్డ్)గా వర్గీకరించిందని వివరించారు. ఈ దేశాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందినవారు సుమారు పది లక్షల చొప్పున ఉన్నారని అంచనా.