‘నారాయణపేట్-కొడంగల్’ అక్కర్లేదు?
♦ ‘పాలమూరు’ నుంచేఆ ఆయకట్టుకు నీరు
♦ ప్రభుత్వానికి నీటి పారుదల శాఖ నివేదిక
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వం, విపక్షాల మధ్య వివాదంగా మారిన ‘నారాయణపేట్-కొడంగల్’ ఎత్తిపోతల పథకం ఆయకట్టుకు పాలమూరు ప్రాజెక్టు ద్వారానే నీరందించవచ్చని నీటి పారుదల శాఖ తేల్చింది. భీమా ప్రాజెక్టు కింది ప్రతిపాదిత లక్ష ఎకరాల ఆయకట్టులో మెజారిటీ ఆయకట్టుకు పాల మూరుతో నీరందించవచ్చని.. మిగతా 17,285 ఎకరాల ఆయకట్టుకు కర్వెన రిజర్వాయర్ ద్వారాగానీ, చిన్న ఎత్తిపోతల పథకాన్ని నిర్మించడం ద్వారాగానీ నీరివ్వొచ్చని సూచిం చింది. దీంతో ‘నారాయణపేట్-కొడంగల్’ ఎత్తిపోతల పథకాన్ని కొనసాగించాల్సిన అవసరం లేదని నీటి పారుదల శాఖ చెప్పకనే చెప్పింది.
భీమా ప్రాజెక్టు నుంచి..
కృష్ణా బేసిన్‌లోని భీమా ఎత్తిపోతల పథకానికి అప్పటి బచావత్ ట్రిబ్యునల్ 20 టీఎంసీల నికర జలాలను కేటాయించింది. అప్పటి ప్రభుత్వం టీఎంసీకి 10 వేల ఎకరాల సాగు చొప్పున లెక్కలు వేసి 2.03 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరిచ్చేలా ప్రణాళికలు వేశారు. తర్వాతి కాలంలో పెరిగిన సాంకేతికత, కాల్వల ఆధునీకరణ నేపథ్యంలో... ఒక టీఎంసీతో 15 వేల ఎకరాలకు నీరివ్వొచ్చని అంచనా వేశారు. ఇదే సమయంలో భీమా ప్రాజెక్టు కింద కొల్లాపూర్ నియోజకవర్గంలో ఉన్న చివరి ఆయకట్టు భూమి 15 వేల ఎకరాలను కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కిందకి బదలాయించారు.
దీంతో భీమా ప్రాజెక్టు కింద నిర్ణయించిన 2.03 లక్షల ఆయకట్టుకు 12.9 టీఎంసీలు సరిపోతాయని లెక్కలు వేశారు. మిగతా 7.1 టీఎంసీలతో మక్తల్, నారాయణపేట, కొడంగల్ నియోజకవర్గాల్లో లక్ష ఎకరాల సాగు అవసరాలు తీర్చేలా ప్రాజెక్టును డిజైన్ చేసి... నారాయణపేట-కొడంగల్ (భీమా) ఎత్తిపోతల పథకంగా పేరు పెట్టారు. దానికి 2014 మే 23న రూ.1,450 కోట్లకు పరిపాలనా అనుమతులు మంజూరు చేయడంతోపాటు.. రూ.133.86 కోట్లను విడుదల చేశారు. ఇందులో రూ.130.5 కోట్లు భూసేకరణకు, మిగతా సొమ్మును ప్రాజెక్టు డిజైన్, ఇన్వెస్టిగేషన్ కోసం కేటాయించారు.
మిగిలేది 17,285 ఎకరాలే..!
తెలంగాణ ఏర్పాటయ్యాక అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం.. ‘పాలమూరు-రంగారెడ్డి’ ప్రాజెక్టును తెరమీదకు తెచ్చింది. నారాయణపేట, మక్తల్, కొడంగల్ నియోజకవర్గాలకు ఆ ప్రాజెక్టు నుంచే నీరివ్వాలని నిర్ణయించి ‘నారాయణపేట-కొడంగల్’ పథకాన్ని పక్కనపెట్టింది. అయితే పాలమూరు కింద ఈ మూడు నియోజకవర్గాలు పూర్తిగా చివరి ఆయకట్టులో ఉండడం, అంతేగాకుండా పాల మూరు కేటాయించిన నీరు వరద జలాలపై ఆధారపడి ఉండడంతో ఇక్కడి ఆందోళనలు చేపట్టింది. ‘నారాయణపేట-కొడంగల్’ పథకాన్ని కొనసాగించాలని రాజకీయ పక్షాలు సైతం డిమాండ్ చేస్తున్నాయి.
దీంతో ఈ అంశంపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ప్రాజెక్టు అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు పరిశీలన జరిపిన అధికారులు సర్కారుకు తుది నివేదిక అందజేశారు. పాలమూరులోని కర్వెన, ఉద్ధండాపూర్ రిజర్వాయర్ల కింద నారాయణపేట్, కొడంగల్, మక్తల్ నియోజకవర్గాల్లోని మెజారిటీ ఆయకట్టు సాగులోకి వస్తుందని నివేదికలో తెలిపారు. కేవలం దౌల్తాబాద్, దామరగిద్ద మండలాల్లోని 6 గ్రామాలు, కొడంగల్‌లోని 2 గ్రామాలు, తాండూర్లోని 4, నారాయణపేట్‌లోని 2, కోస్గి మండలంలోని 2 గ్రామాల్లో కలిపి 17,285 ఎకరాల ఆయకట్టు మిగిలిపోతుందని అందులో పేర్కొన్నారు. ఎత్తుగా ఉన్న ప్రాంతాలకు సైతం ప్రత్యేక ఎత్త్తిపోతల పథకం ద్వారాగానీ, పాలమూరు ప్రాజెక్టులోని ఇతర రిజర్వాయర్ల ద్వారాగానీ నీటిని అందించవచ్చని వివరించారు.