విశాఖ అడవుల్లో విమాన శకలం?
* ఢిల్లీకి తరలించినట్టు సమాచారం
* ఏఎన్-32 విమానానిదని అనుమానం
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా నాతవరం అటవీ ప్రాంతంలో విమాన శకాలాన్ని పోలిన వస్తువొకటి దొరికిందని ప్రచారం జరుగుతోంది. 9 రోజుల క్రితం చెన్నై నుంచి పోర్టుబ్లెయిర్‌కు వెళ్తూ వాయుసేనకు చెందిన ఏఎన్-32 విమానం అదృశ్యమవడం తెలిసిందే. విమానం బంగాళాఖాతంలో కూలిపోయి ఉండవచ్చన్న అనుమానంతో అప్పట్నుంచీ నేవీ, వాయుసేన బలగాలు గాలిస్తున్నా జాడ కానరాలేదు. ఈ నేపథ్యంలో విశాఖ జిల్లా నాతవరం మండలంలోని అడవుల్లో వారం క్రితం పెద్ద శబ్దంతో విమానం ఒకటి కూలిపోయిందంటూ ప్రచారం రావడంతో అధికారులు అక్కడ విస్తృతంగా గాలించారు.
అయినా ఏ వస్తువులు లభించలేదు. అయితే ఆదివారం విమాన శకలం గ్రామస్తులకు దొరికిందన్న ప్రచారం ఊపందుకుంది. దీనిని స్థానిక అధికారులు ఎన్ఏడీ(నేషనల్ ఆర్మర్డ్ డివిజన్)కి అప్పగించినట్లు సమాచారం. దీన్ని పరిశీలనకు ఢిల్లీలోని వాయుసేన ప్రధాన కార్యాలయానికి పంపినట్టు చెబుతున్నారు. అయితే విమాన శకలం దొరికిందన్న వార్తను అధికారులు ధ్రువీకరించడం లేదు.