జెండాను దగ్ధం చేస్తే పౌరసత్వం రద్దా?
న్యూయార్క్: అమెరికాలో ఎవరైనా జాతీయ జెండాను తగలబెడితే వారి పౌరసత్వం రద్దవుతుందని లేదా ఏడాది జైలు శిక్ష పడుతుందని దేశానికి కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ మంగళవారం రాత్రి ట్విట్టర్లో పౌరులను హెచ్చరించారు. అమెరికా రాజ్యాంగం గురించి సరైన అవగాహన లేకుండా, జాతీయ జెండా తగలబెట్టే విషయమై 1989లో అమెరికా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు గురించి తెలియక ట్రంప్ ఈ హెచ్చరిక చేశారా? తెలిసి కూడా తన ఉద్దేశాన్ని వెల్లడించేందుకు ఈ హెచ్చరిక చేశారా? అన్నది స్పష్టం కావడం లేదు.
అమెరికాలో ఎవరైనా నిరసన వ్యక్తం చేయడం కోసం జాతీయ జెండాను తగలబెట్టడం రాజ్యాంగబద్ధమే. దానికి ఎలాంటి శిక్షలు లేవు. జాతీయ జెండాను దగ్ధం చేయడమనేది ప్రభత్వ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడడంతో సమానమని, అది దేశ రాజ్యాంగం కల్పిస్తున్న ప్రాథమిక హక్కని 1989లో అమెరికా సుప్రీం కోర్టు బెంచీ 5-4 మెజారిటీతో తీర్పును ఇచ్చింది. 1984లో డల్లాస్‌లో జరిగిన రిపబ్లికన్ జాతీయ సదస్సు వేదిక వెలుపల అప్పటి దేశాధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ విధానాలను వ్యతిరేకిస్తూ గ్రెగరీ జాయ్ జాన్సన్ అనే వ్యక్తి అమెరికా జాతీయ జెండాను దగ్ధం చేశారు. ఈ కేసులోనే సుప్రీం కోర్టు తన తీర్పును వెలువరించింది.
అప్పటి నుంచి జాతీయ జెండాను దగ్ధం చేయడాన్ని నేరంగా పరిగణించేందుకు పలు ప్రయత్నాలు జరిగినా అవి ఫలించలేదు. జాతీయ జెండా పరిరక్షణా చట్టానికి సంబంధించిన బిల్లును పార్లమెంట్లో ఓ సభ్యుడు 2005లో ప్రతిపాదించగా అప్పుడు న్యూయార్క్ సెనేటర్‌గా ఉన్న హిల్లరీ క్లింటన్ కూడా మద్దతు పలికారు. ఎవరైనా జాతీయ జెండాను దగ్ధం చేసినా, అవమానించినా లక్ష డాలర్ల జరిమానా లేదా ఏడాది జైలు శిక్ష విధించాలని ఆ బిల్లులో ప్రతిపాదించారు. అయితే ఆ బిల్లు ఇప్పటికీ కూడా సెనేట్‌లో చర్చకు రాలేదు. అదే సమయంలో అలాంటి శిక్షను దేశ రాజ్యాంగంలోనే పొందుపర్చాలంటూ అప్పటి ప్రభుత్వం అమెరికా కాంగ్రెస్‌లో ఓ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టింది. దాన్ని ప్రజా ప్రతినిధుల సభ 286-130 ఓట్లతో ఆమోదించింది. ఆ తర్వాత సెనేట్‌లో ఆ బిల్లు 66-34 ఓట్ల తేడాతో వీగిపోయింది. సెనేట్‌లో బిల్లు ఆమోదానికి మూడింట రెండు వంతల మెజారిటీ అవసరం కాగా, ఒక్క ఓటు తగ్గింది.
ఒకవేళ ఆ రోజున సెనేట్ ఆ బిల్లును ఆమోదించి ఉన్నట్లయితే దేశంలోని 50 రాష్ట్రాలకుగాను 38 రాష్ట్రాలు ఆ బిల్లును ఆమోదించినట్లయితేనే రాజ్యాంగ సవరణ సాధ్యమయ్యేది. ఇప్పుడు డోనాల్డ్ ట్రంప్ దేశాధ్యక్షుడిగా ఎన్నికవడాన్ని నిరసిస్తూ మసాచుసెట్స్‌లోని హాంప్‌షైర్ కాలేజీలో కొందర విద్యార్థులు అమెరికా జాతీయ జెండాను తగలబెట్టిన నేపథ్యంలో ట్రంప్ ఈ హెచ్చరికను జారీ చేసినట్లు అర్థం అవుతోంది. జెండాను ఎవరు దగ్ధం చేసినా దాన్ని నేరంగానే పరిగణించాలని ట్రంప్ అధికార యంత్రాంగంలోని అధికారి జాసన్ మిల్లర్ వ్యాఖ్యానించారు.