ఆరు లైన్ల హైవే
♦ హైదరాబాద్ - మచిలీపట్నం జాతీయ రహదారి విస్తరణకు కసరత్తు
♦ పునరావాసం, తరలింపునకే రూ.140 కోట్లకు పైగా వ్యయం
♦ రివైజ్డ్ ప్రతిపాదనల్లో అధికార యంత్రాంగం
♦ బ్రిడ్జి నిర్మించే ప్రాంతాన్ని పరిశీలించిన హైవే చీఫ్ ఇంజినీర్
సాక్షి, విజయవాడ : నగర పరిధిలోని హైదరాబాద్ - మచిలీపట్నం జాతీయ రహదారి విస్తరణకు కసరత్తు మొదలైంది. విజయవాడ రాజధానిగా మారిన క్రమంలో ట్రాఫిక్ రద్దీ రెట్టింపయింది. నగరంలోని రహదారులను ఇప్పటికే కొంత మేరకు విస్తరించినా, నగర ప్రవేశ ప్రాంతాల్లో మాత్రం రోడ్లు ఇరుకుగా ఉన్నాయి. దీంతో కనకదుర్గ ఫ్లైఓవర్‌కు అనుసంధానంగా జాతీయ రహదారిని కూడా విస్తరించాలని నిర్ణయించారు. కోట్లాది రూపాయల విలువైన విద్యుత్ లైన్ మార్చడం మొదలు రెండు సబ్ స్టేషన్లు కూడా తొలగించాల్సి రావటం ఇబ్బందికరంగా మారింది.
విజయవాడ నగరానికి బయటి ప్రాంతాల నుంచి వచ్చే వాహనాల రద్దీ బాగా పెరగడంతో తరచూ ట్రాఫిక్ స్తంభిస్తోంది. ఈ క్రమంలో కనకదుర్గ దేవస్థానం సమీపంలో బ్రిడ్జినిర్మిస్తే ట్రాఫిక్ తీవ్రత కొంత తగ్గుతుందని భావిం చారు. దీనికి అనుగుణంగా ఆర్అండ్బీ జాతీయ రహదారుల విభాగం అధికారులు ప్రాథమికంగా ప్రతిపాదనలను సిద్ధం చేసి జాతీయ రహదారుల శాఖకు పంపడంతో ఆమోదముద్ర వేసింది. రూ.427 కోట్లతో బ్రిడ్జి నిర్మాణం, రహదారుల విస్తరణ పనులు నిర్వహించనుంది. ఈ క్రమంలో జాతీయ రహదారుల శాఖ మొత్తం ప్రాజెక్ట్‌ను పూర్తిచేయనుంది. 1850 మీటర్ల పొడవున 50 పిల్లర్లతో దుర్గగుడి ఫ్లైఓవర్ నిర్మించనున్నారు.
కుమ్మరిపాలెం సెంటర్ దాటిన తర్వాత లారీ స్టాండ్ నుంచి రాజీవ్ గాంధీ పార్క్ వరకు బ్రిడ్జి నిర్మించనున్నారు. వచ్చే ఏడాది కల్లా దీనిని పూర్తి చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో బిడ్జ్రితో పాటు హైదరాబాద్ వెళ్లే వైపు 220 మీటర్లు, విజయవాడ వైపు 220 మీటర్ల అప్రోచ్ రోడ్ల నిర్మాణం, జాతీయ రహదారిని ఆరు లైన్లుగా విస్తరించడం తదితర పనులు నిర్వహించనున్నారు. ఫ్లైవోవర్ నిర్మాణం నేపథ్యంలో 28 వేల చదరపు మీటర్ల మేర స్థల సేకరణ చేయనున్నారు.
ఈ క్రమంలో ఆక్రమణల తొలగింపు బాధ్యతను నగరపాలక సంస్థ, ఆర్ అండ్ బీ అధికారులు పర్యవేక్షించనున్నారు. విద్యుత్ శాఖ అధికారులు రోడ్లపై ఉన్న లైన్లను తొలగించడంతోపాటు, ఈ మార్గంలోని రెండు సబ్స్టేషన్ల మార్పు తదితర పనులు నిర్వహించనున్నారు. జలవనరుల శాఖ ఇరిగేషన్ కాలవలకు ఇబ్బంది లేకుండా అవసరమైన సహకారం అందించనుంది. ఈ క్రమంలో వచ్చే నెలలో పనులు ప్రారంభమగానే ఆయా శాఖలు పనులతో పాటు ఆక్రమణల తొలగింపు చేపట్టాల్సి ఉంది.
రూ.140 కోట్లకు పైనే ఖర్చు
జాతీయ రహదారి పక్కనున్న ఆక్రమణల తొలగింపు, విద్యుత్ లైన్ల మార్పు తదితర పనులు నిర్వహణకు సుమారు రూ.140 కోట్లకు పైగా ఖర్చు అవుతందని అంచనా వేశారు. ముఖ్యంగా వెయ్యికిపైగా చిరువ్యాపారుల దుకాణాలు, రోడ్డు మార్జిన్‌లోని వందలాది ఇళ్లను తొలగించాల్సి ఉంది. బాధితులకు నష్టపరిహారం చెల్లించాల్సి ఉంది. విద్యుత్ లైన్ల మార్పునకు రూ.6.1 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. రెండు సబ్స్టేషన్లను తరలించేందుకు రూ.35 కోట్ల ఖర్చవుతుందని ట్రాన్స్‌కో అంచనా వేసిప్రతి పాదనలు పంపింది. అయితే అంచనాలు ఎక్కువగా ఉన్నాయని 30 నుంచి 40 శాతం తగ్గించి పంపించాలని ఆదేశాలు అందాయి. పునరావాసానికి కూడా తక్కువ ఖర్చు చేస్తేనే ప్రాజెక్ట్‌కు కేటాయించిన నిధులు సరిపోతాయన్న అభిప్రాయం జాతీయ రహదారుల విభాగం అధికారులు వ్యక్తంచేస్తున్నారు.