గిరిజన వర్సిటీ ఏర్పాటుపై ఆశలు గల్లంతు
ఉట్నూర్ : జిల్లాలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుపై ఆశలు గల్లంతు అవుతున్నాయి. తాజాగా ప్రభుత్వం వరంగల్ జిల్లా ములుగు నియోజకవర్గంలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు గల అవకాశాలు పరిశీలించాలని ఆ జిల్లా యంత్రాగానికి ఆదేశాలు జారీ చేసింది. దీంతో అధికారులు సర్వే పనులకు శ్రీకారం చుడుతున్నారు. ఎన్నో ఏళ్లుగా గిరిజన యూనివర్సిటీ జిల్లాలోనే ఏర్పాటు అవుతుందన్న ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. ఇప్పటికైన మన జిల్లా ప్రజాప్రతినిధులు యూనివర్సిటీ కోసం పోరాడాలని గిరిజనులు కోరుతున్నారు.
ఆశల పల్లకిలో ఆరేళ్లు..
2008లో అప్పటి యూపీఏ సర్కారు జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించింది. 2008 నవంబర్ 17న జీవో నంబర్ 797, 2011 ఆగస్టు 27న జీవో నంబర్ 783ను విడుదల చేసింది. దీంతో జిల్లా, ఐటీడీ ఏ అధికారులు ఉట్నూర్‌లోని ప్రభుత్వ జూనియ ర్ కళాశాల వెనకాల ప్రభుత్వానికి చెందిన 470 ఎకరాల పరంపోగు భూమిలో 300 ఎకరాలు గుర్తించింది.
అలాగే 7వ నంబరు జాతీయ రహదారికి 34 కి.మీ. దూరంలో రవాణా సౌకర్యం, హైటెన్షన్ విద్యుత్తు తదితర సౌకర్యాలు ఉన్నట్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదికలు పంపించారు. యూపీఏ సర్కార్ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సందర్భంగా పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేస్తూ కేంద్ర కేబినెట్ ఆమోదించిన తెలంగాణ బిల్లు పదకొండో అంశంలో తెలంగాణలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు ప్రస్తావన కూడా ఉంది. దీంతో అందరూ యూనివర్సిటీ ఏర్పాటవుతుందని భావించారు. ఇప్పుడేమో వరంగల్‌కు తరలుతున్నట్లు ప్రచారం జరుగుతుండటంతో గిరిజనులు నిరాశకు గురవుతున్నారు.
ప్రజాప్రతినిధులపైనే భారం
జిల్లాలోని ఏజెన్సీ కేంద్రమైన ఉట్నూర్‌లో గిరిజ న యూనివర్సిటీ ఏర్పాటుకు అనువైన అవకాశాలున్నా రాజకీయ కారణాల వల్ల వరంగల్‌లో ని ములుగుకు తరలుతున్నట్లు తెలుస్తోంది. ప్ర స్తుతం జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు జరగాలంటే ప్రజాప్రతినిధులే కీలకమని అడవి బిడ్డలు భావిస్తున్నారు. జిల్లాలో అధికార ప్రభుత్వానికి తొమ్మిది అసెంబ్లీ స్థానాలు ఉండటం, ఒక మంత్రి పదవి, ఇద్దరు ఎంపీలు టీఆర్ఎస్ వాళ్లే ఉన్నారు.
ఇందులో ఒక ఎంపీ, ముగ్గురు ఎమ్మెల్యేలు గిరిజన తెగకు చెందిన వారు ఉన్నారు. వీరంత ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఏజెన్సీ కేంద్రంగా గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు జరిగేలా చూడాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. మన జిల్లాలో కాకుండా వేరే జిల్లాకు యూనివర్సిటీ తరలిపోతే అది ప్రజాప్రతినిధుల వైఫల్యమే అవుతుంది.