రష్మీ, భవానిలకు కాంస్యాలు
భువనేశ్వర్: ఆంధ్రప్రదేశ్ అమ్మాయిలు రష్మీ, భవాని యాదవ్ జాతీయ అథ్లెటిక్స్ పోటీల్లో పతకాలతో మెరిశారు. ఒడిశాలో జరుగుతున్న ఈ పోటీల్లో ఇద్దరు కాంస్య పతకాలు సాధించారు. జాతీయ అంతర్ రాష్ట్ర అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో మహిళల జావెలిన్ త్రో ఈవెంట్లో రష్మీ ఈటెను 50.95 మీటర్ల దూరం విసిరి మూడో స్థానంలో నిలిచింది. నాలుగో ప్రయత్నంలో ఈ మెరుగైన ప్రదర్శన ద్వారా ఆమె కాంస్య పతకం నెగ్గింది. ఇందులో అన్ను రాణి (ఉత్తరప్రదేశ్; 58.22 మీ.) స్వర్ణం, ప్రియాంక (హరియాణా; 51.94 మీ.) రజతం గెలుపొందారు.
అంతకుముందు జరిగిన లాంగ్‌జంప్ పోటీలో భవాని 6.44 మీటర్ల దూరం దూకి కాంస్యంతో తృప్తిపడింది. అన్సీ సోజన్ (కేరళ; 6.51 మీ.), శైలీసింగ్ (ఉత్తరప్రదేశ్; 6.49 మీ.) వరుసగా పసిడి, రజత పతకాలు సాధించారు. భారత స్టార్ అథ్లెట్, షాట్‌పుటర్ తజీందర్ పాల్ తూర్ తన రికార్డును తానే సవరించి కొత్త ‘ఆసియా’ రికార్డు నెలకొల్పాడు. అతను గుండును 21.77 మీటర్ల దూరం విసిరాడు. దీంతో 28 ఏళ్ల పంజాబ్ అథ్లెట్ తజీందర్ 2021లో 21.49 మీటర్లతో నెలకొల్పిన రికార్డును అధిగమించాడు. అతను విసిరిన దూరం ఈ సీజన్లో ప్రపంచంలోనే తొమ్మిదో మెరుగైన ప్రదర్శనగా నిలిచింది. 21.40 మీటర్ల క్వాలిఫయింగ్ మార్క్‌ను దాటడంతో
ప్రపంచ చాంపియన్‌షిప్, ఆసియా క్రీడలకూ తజీందర్ పాల్ అర్హత సంపాదించాడు. సోమవారం ముగిసిన ఈ పోటీల్లో ఏపీ అమ్మాయి యెర్రా జ్యోతి ఉత్తమ మహిళా అథ్లెట్‌గా ఎంపికైంది. తమిళనాడు ఓవరాల్ చాంపియన్‌గా నిలిచింది.