ఒకే పెన్షన్ కోసం ఉద్యమిద్దాం
పెంటపాడు :మాజీ సైనికులు, సైనికాధికారులకు ఒకే ర్యాంక్ -ఒకే పింఛన్ సాధించేందుకు రాష్ట్రంలోని మాజీ సైనికుల సంఘం నాయకులంతా ఐక్యంగా ఉద్యమం చేయాలని జాతీయ మాజీ సైనికాధికారుల సమన్వయకమిటీ (ఎన్ఈసీసీ) తీర్మానించింది. ఎన్ఈసీసీ రాష్ట్ర సమన్వయకర్త తనబుద్ధి భోగేశ్వరరావు ఆధ్వర్యంలో అలంపురంలో పలు జిల్లాల మాజీ సైనికాధికారుల సంఘాల ప్రతినిధుల ప్రథమ సమావేశం ఆదివారం నిర్వహించారు. భోగేశ్వరరావు మట్లాడుతూ ప్రస్తుతం రిటైర్డ అయిన సైనికులలో వ్యత్యాసాలు చూపడం కేంద్ర ప్రభుత్వానికి తగదన్నారు. సైనికులు, సైనికాధికారులు ఏ ర్యాంకులో ఉద్యోగ విరమణ పొందినా దేశంలో అన్ని ప్రదేశాల్లో ఒకే పింఛను ఇవ్వాలనే డిమాండ్‌తో కొంత కాలంగా దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళన జరగుతోందన్నారు. దానికి రాష్ట్ర సంఘం తరఫున పూర్తిమద్దతు ఇవ్వాలన్నారు.
రాష్ట్రం విభజన నేపథ్యంలో ఎన్ఈసీసీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ ఏర్పాటు, విజయవాడలో సంఘానికి భవనం, సభ్యత్వ రుసుము తదితర విషయాలను చర్చించారు. సంఘం ప్రధానకార్యదర్శి బి.మనోహర్‌రాజు, ఉపాధ్యక్షులు వి.పట్టాభిరామయ్య, బి.ఆడమ్‌రాజు, గౌరవాధ్యక్షులు కె.నాగరాజు, సహాయకార్యదర్శులు బీఎన్ స్వామి, జి.జానకిరామ్, ఆర్.సాంబశివరావు, కె.బలరామారావు, ఎం.శంకర్రావు, ఎ.శాంతయ్య పాల్గొన్నారు.
సైనిక స్థూపం వద్ద నివాళులు
ముందుగా వీరు గూడెం మండలం మిలట్రీమాధవరంలోని అమర జవాన్ల స్థూపానికి నివాళులు అర్పించారు. ఈ గ్రామంలో మాజీ సైనికుల సంక్షేమం కోసం భోగేశ్వరరావు రూ. 10 వేలు అందజేశారు. తన కుటుంబం నుంచి దేశ రక్షణ కోసం ఎంతోమంది సైనికులను అందించిన లక్కాకుల ఆదిలక్ష్మిని సభ్యులు ఘనంగా సన్మానించారు. ఆమెను వారు కొనియాడారు. ఆమె ఆరుగురు కుమారులు దేశరక్షణ కోసం పనిచేశారు. ఆమె మనుమలూ సైన్యంలో ప్రస్తుతం సేవలందిస్తున్నారు. మాధవరం మాజీ సైనికుల సంఘం సభ్యుడు బొల్లం వీరయ్య, పత్తి కృష్ణ, గోపిశెట్టి వెంకటేశ్వరావు, లక్కాకుల నాగేశ్వరరావు పాల్గొన్నారు.
నేటి నుంచి నిట్ ప్రవేశాలు
తాడేపల్లిగూడెం : ఏపీ నిట్‌లో ప్రవేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నారుు. నిట్‌లో సీటు పొందిన విద్యార్థులు వారి ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు, అటెస్ట్ చేసిన సర్టిఫికెట్ల ఫోటోస్టాట్ కాపీల సెట్‌ను సమర్పించాలి. 26 వరకు విద్యార్థులు చేరే అవకాశం కల్పించారు. 27న విద్యార్థులు, ఫ్యాకల్టీ పరిచయంతోపాటు తాత్కాలిక క్యాంపస్‌లో సౌకర్యాలు తదితరాలను విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు చూపిస్తారు. 28 నుంచి తరగతులు మొదలవుతాయి.
పశ్చిమ డెల్టాకు 5,500 క్యూసెక్కులు విడుదల
కొవ్వూరు : పశ్చిమ డెల్టా కాలువకు ఆదివారం 5,500 క్యూసెక్కుల చొప్పున నీటిని వదిలారు. ఏలూరు కాలువకు 1,106, ఉండి కాలువకు 884, గోస్తనీ కాలువకి 720, అత్తిలి కాలువకు 468, నరసాపురం కాలువకు 1,774 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.
‘జల్లేరు’ మంపు భూముల రికార్డుల పరిశీలన
జీలుగుమిల్లి : జల్లేరు జలాశయం ముంపునకు గురవుతున్న భూముల రికార్దులను జలాశయం ప్రత్యేక డీటీ సుబ్రహ్మణ్యం, స్థానిక వీఆర్వో జోగిరిజ పరిశీలిస్తున్నారు. ముంపునకు గురైనా ప్రభుత్వం విడుదల చేసిన షెడ్యూల్లో తమ భూముల వివరాలు లేని రైతులు తమ రికార్డుల(దస్తావేజులు, పట్టాదార్ పాస్ పుస్తకాలు తదితరాలు)లను స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో అందజేయాలని వారు తెలిపారు.