కొలువుల కోసం బారులుతీరిన యువత
జాబ్‌మేళాకు అనూహ్య స్పందన
వెంకటగిరిటౌన్ : కొలువుల కోసం నిరుద్యోగ యువత బారులుతీరారు. నేదురుమల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వెంకటగిరిలోని నేదురుమల్లి భవనంలో శనివారం నిర్వహించిన జాబ్‌మేళాకు అనూహ్య స్పందన లభించింది. నియోజకవర్గ స్థాయిలో నిర్వహించిన జాబ్‌మేళాకు సుమారు 5 వేల మంది నిరుద్యోగులు హాజరైనట్లు అంచనా. ఫౌండేషన్ చైర్మన్ నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ వెంకటగిరి నియోజకవర్గంలో యువతకు విద్య, ఉపాధి అవకాశాలు కల్పించాలన్న దివంగత మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి ఆశయ సాధనలో భాగమే జాబ్‌మేళా నిర్వహణ అన్నారు. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, ఎంబీఏ, ఎంసీఏ, డిప్లొమా, బీటెక్ వంటి కోర్సులకు 18 ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ఇంటర్య్వూలు నిర్వహించారు. జాబ్‌మేళాకు నియోజకవర్గంలో వెంకటగిరి, డక్కిలి, బాలాయపల్లి, సైదాపురం, రాపూరు, కలువాయి మండలాల నుంచి అధిక సంఖ్య లో యువత, వారి తల్లిదండ్రులు హాజరుకావడంతో స్థానిక క్రాస్‌రోడ్డు కూడలి, రైల్వేస్టేషన్ రోడ్లు జనంతో కిక్కిరిశాయి. రైల్వేస్టేషన్ రోడ్డులో ట్రాఫిక్ స్తంభించడంతో వెంకటగిరి - నాయుడుపేట మార్గంలో బస్సులు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయాయి.
నాయకులకు నో ఎంట్రీ...
జాబ్‌మేళాకు హాజరైన అభ్యర్థులు మినహా నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులను నేదురుమల్లి నివాసంలోకి అనుమతించలేదు. ఈ కార్యక్రమానికి సహకరించాలని పార్టీ నాయకులకు నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి స్వయంగా చెప్పారు.
మేము సైతం..: సైదాపురం మండలం చాగణం రాజుపాళేనికి చెందిన బి. శ్రీనివాసరావు (మరుగుజ్జు) బీఈడీ, వెంకటగిరి పట్టణానికి చెందిన ఎస్ హరిబాబు (అంధ విద్యార్థి) ఇంటర్, పి. సుబ్బరాయులు (వికలాంగుడు) జాబ్‌మేళాకు హాజరయ్యారు.