ద్విపథం.. ఒక గమ్యం
కడప కల్చరల్:
అభ్యుదయ రచయితల సంఘం కడపశాఖ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక సీపీ బ్రౌన్ గ్రంథాలయంలో సంస్థ బాధ్యులు డాక్టర్ ఎన్.ఈశ్వర్‌రెడ్డి రచించిన రెండు పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. సాహిత్యంలో అన్ని ప్రక్రియలు సమాజ హితం కోరేవే. డాక్టర్ ఎన్.ఈశ్వర్‌రెడ్డి కవిత్వాన్ని తనకు ఆత్మీయ మిత్రునిగా ఇష్టపడతారు. ఆలోచింపజేసే వచనం కంటే హృదయాన్ని కదిలింపజేసే భావుకత, క్లుప్తత, అంతర్లీనంగా సంగీతం ధ్వనించే కవిత్వం వైపే ఆయన కలం, గలం మొగ్గుచూపుతున్నాయి. ప్రస్తుతం ఆవిష్కృతం కానున్న ‘కవిత–మానవీయత’ పుస్తకం ఎందరో కవులు తమ రచనలతో మానవతను ఆవిష్కరించారో తెలుపుతుంది. కవితకు నిజమైన లక్ష్యాన్ని సాధించి ఉత్తమ మార్గాన్ని చూపుతుంది. మనము అదే బాటలో నడుద్దామన్న స్పూర్తిని కలిగిస్తోంది.
మనకోసం కాకుండా సమాజం కోసం బ్రతికిన వారే చరిత్రలో నిలుస్తారన్నది పెద్దల మాట. సామాజిక హితం కోరని కవిత్వం కాలానికి నిలువబోదని కూడా వారు చెప్పారు. ఎన్నో సందర్బాల్లో తనకు మార్గదర్శనం చేసిన రచనలను హృదయ గ్రంథాలయం నుంచి డాక్టర్ ఈశ్వర్‌రెడ్డి సాహిత్యం, సామాజిక అవసరం పుస్తకంలో ఆవిష్కరించారు. తనకు కూడా ఆ పథమే ఇష్టం గనుక కవిగా తన బాధ్యత గనుక అలాంటి ఎందరో రచనలను, అవి లక్ష్యం వైపు సాగిన విధానాన్ని ఈ పుస్తకంలో తెలుపుతున్నారు. ఈ పుస్తకాలను డాక్టర్ పీసీ వెంకటేశ్వర్లు, డాక్టర్ మూల మల్లికార్జునరెడ్డి పరిచయం చేయనున్నారు. ఆచార్య రాచపాలెం చంద్రశేఖర్‌రెడ్డి సబాధ్యక్షులుగా, ఆచార్య ఆర్వీఎస్ సుందరం ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఆర్ఎం ఉమామహేశ్వరరావు, ఆచార్య బి.రామకృష్ణారెడ్డి, ఆచార్య డీవీ శ్రవణ్‌కుమార్ అతిథులుగా హాజరు కానున్నారు.