రాష్ట్రంలో మరో 86 బార్లు!
నూతన బార్ లెసైన్స్ విధానాన్ని ప్రకటించిన ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: బార్ లెసైన్స్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నూతన విధానాన్ని ప్రకటించింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన బార్లు కేటాయించనున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రతీ 13 వేల జనాభాకు ఒక బార్ అండ్ రెస్టారెంట్ ఏర్పా టు చేసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. అలాగే మున్సిపాలిటీ, నగర పంచాయతీల్లో 30 వేల జనాభాకు బార్ ఏర్పాటు చేసుకోవచ్చు.
కొత్త పాలసీ ప్రకారం జనాభాతో సంబంధం లేకుండా మూడు నక్షత్రాల హోటళ్లు, ఆపై స్థాయి హోటళ్ల రెస్టారెంట్లలో కూడా బార్లు నిర్వహించుకోవచ్చు. జీహెచ్ఎంసీతో పాటు మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్లు, నగరపంచాయితీలకు ఇది వర్తిస్తుంది. పర్యాటక కేంద్రాల్లోని రెస్టారెంట్లలోనూ బార్లు నిర్వహించుకోవచ్చు. బార్ అండ్ రెస్టారెంట్ల సమయాన్ని అదనంగా గంట పొడిగించాలని భావించినప్పటికీ... ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల్లో దాన్ని ప్రస్తావించలేదు. నూతన బార్ల లెసైన్స్లకు సంబంధించి ఒకట్రెండు రోజుల్లో నోటిఫికేషన్ విడుదల కానుంది.
రాష్ట్రవ్యాప్తంగా 846కు చేరిన బార్లు
కొత్త పాలసీ ప్రకారం రాష్ట్రంలో బార్ల సంఖ్య 846కు చేరనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 760 బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. వీటిలో ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 509 బార్లు ఉన్నాయి. జీహెచ్ఎంసీని మినహా ఇస్తే రాష్ట్రవ్యాప్తంగా 251 బార్లు ఉన్నాయి. ప్రస్తుతం జనాభా ప్రాతిపదికన నూతన పాలసీ ప్రకా రం రాష్ట్రవ్యాప్తంగా అదనంగా 86 బార్లు అం దుబాటులోకి రానున్నాయి. కొత్తగా వచ్చే బార్లలో కూడా జీహెచ్ఎంసీ పరిధిలోనే 38 అందుబాటులోకి రానున్నాయి. జీహెచ్ఎంసీని మినహాయించి రాష్ట్రవ్యాప్తంగా 48 బార్లు ఏర్పాటు కానున్నాయి.
ఈ పాలసీ ప్రకారం రాష్ట్ర ఖజానాకు బార్ల లెసై న్స్ ఫీజు ద్వారా రూ.115 కోట్లకు పైగా ఆదాయం లభించనుంది. జీహెచ్ఎంసీ పరిధిలో నిర్వహించే బార్ల లెసైన్స్ ఫీజును ప్రభుత్వం రూ.35 లక్షలుగా నిర్ధారించింది. మున్సిపాలిటీలు, నగర పంచాయితీలలో నిర్వహించే బార్ల లెసైన్స్ ఫీజును రూ.28 లక్షలుగా నిర్ణయించింది. అయితే వరంగల్, కరీంనగర్ జిల్లాలోని బార్ల లెసైన్స్ ఫీజును మాత్రం అన్నిచోట్ల కంటే ఎక్కువగా నిర్ధారించారు. ఈ రెండు జిల్లాలోని బార్ల లెసైన్స్ ఫీజును రూ.38 లక్షలుగా నిర్ణయించారు.ఎక్కువ దరఖాస్తులు వస్తే డ్రా ద్వారా నిర్ణయిస్తారు.
ఇవీ నిబంధనలు
బార్ అండ్ రెస్టారెంట్ల కోసం దరఖాస్తు చేసుకునే వారికి ప్రభుత్వం కొన్ని నిబంధనలు పెట్టింది. దరఖాస్తుదారుడు ట్రేడ్ లెసైన్స్ కలిగి ఉండటంతో పాటు రెస్టారెంట్ ఉండి తీరాలని స్పష్టం చేసింది. దరఖాస్తుదారు కచ్చితంగా రెండేళ్ల పాటు వ్యాట్ చెల్లించి ఉండాలని సూచించింది. బార్ల ఏర్పాటు స్కూళ్లకు, ప్రార్థనా మందిరాలకు 100 మీటర్ల దూరం ఉండాలని స్పష్టం చేసింది. బార్ల దరఖాస్తు కోసం మొదటగా రూ.5 వేలు చెల్లించి అఫ్లికేషన్ ఫారం తీసుకోవాలి. ఈ మొత్తాన్ని తిరిగి చెల్లించరు. దరఖాస్తులను ఎక్సైజ్ సూపరింటెండెంట్ స్థాయి గల అధికారి పరిశీ లిస్తారు. నియమ నిబంధనలన్నీ పక్కాగా ఉండి, పోటీ లేకపోతే లెసైన్స్ నేరుగా అప్పగిస్తారు. పోటీ ఉంటే లాటరీ పద్ధతిన లెసైన్స్ ఇస్తారు.