ప్రయాణికులకు అధునిక సౌకర్యాలు
గుంతకల్లు : ప్రయాణికులకు ఆధునిక సౌకర్యాలు కల్పించే దిశగా రైల్వే ప్రణాళికలు రూపొందించుకుని ముందుకు సాగుతోందని గుంతకల్లు రైల్వే డివిజనల్ మేనేజర్ అమితాబ్ఓజా పేర్కొన్నారు. స్థానిక రైల్వే క్రీడా మైదానంలో గురువారం జాతీయ పతాకాన్ని ఎగురవేసిన అనంతరం దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్ కుమార్ యాదవ్ పంపిన గణతంత్ర దినోత్సవ సందేశాన్ని డీఆర్ఎం ఉద్యోగులు, విద్యార్థులకు, పట్టణ ప్రజలకు వివరించారు. ఈ ఏడాది ప్రయాణికుల కోసం వివిధ సౌకార్యాల ఏర్పాట్లకు రూ. 52.27 కోట్లు ఖర్చు చేశామన్నారు.
రైల్వే స్టేషన్లలో ప్రాథమిక సౌకార్యాల నాణ్యతను పెంచడంతో పాటు దివ్యాంగుల కోసం ప్రత్యేక దృష్టితో వారికి ఉపయోగపడే సదుపాయాలను సమకూర్చడంతో పాటు రైలు బోగీలపై బ్రెయిలీ లిపి బోర్డులను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అంతకు ముందు డీఆర్ఎం జాతీయ పతాకాన్ని ఎగురవేసి ఆర్పీఎఫ్ పోలీసుల గౌరవ వందనాన్ని సీక్వరించారు. రిపబ్లిక్ డే సందర్భంగా నిర్వహించిన డ్రాయింగ్ పోటీల్లో ప్రతిభ చాటిన రైల్వే స్కూల్ విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఏడీఆర్ఎం కేవీ సుబ్బరాయుడు, సీనియర్ డీసీఎం సీహెచ్ రాకేష్, సీనియర్ డీపీఓ బలరామయ్య, సీనియర్ డీఎఫ్ఎం చంద్రశేఖర్బాబు, ఆర్పీఎఫ్ కమాండెంట్ ఏలిషా తదితరులు పాల్గొన్నారు.