సమ్‌థింగ్ స్పెషల్
నే ఆటోవాణ్ణి...అందరివాణ్ణి!
‘ఆటోలలో అన్నాదురై ఆటో వేరయా...’ అనుకుంటారు అందరూ. చెన్నైకి చెందిన అన్నాదురై ఆటోకు ఇతర ఆటోలలో లేని సౌకర్యాలు ఉన్నాయి. గ్రంథాలయాన్ని తలపించేలా పుస్తకాలు ఉంటాయి. మొబైల్ ఫోన్ ఛార్జర్, వై-ఫై, టాబ్లెట్లు ఆటోలో ఉంటాయి. ఆటోలో ప్రయాణిస్తున్నంత సేపు వాటిని ఉచితంగా వాడుకోవచ్చు.
మరో విశేషం ఏమిటంటే ఆటో ఎక్కిన ప్రతి కస్టమర్‌కు లక్కీ కూపన్ ఇస్తాడు. నెల చివరిలో డ్రా తీసి విజేతను ఎంపిక చేస్తాడు. డ్రాలో గెలిచిన వారు నెల మొత్తం ఉచితంగా ప్రయాణించవచ్చు. కొన్నిసార్లు నగదు బహుమతి కూడా ఉంటుంది.
వచ్చిన ఆదాయంలో సగం పేదలకు పంచాలనేది ఇరవై ఎనిమిది సంవత్సరాల అన్నాదురై ఆశయం. కూలీ పనులు చేసే శ్రామికులు, ఆస్పత్రిలో పనిచేసే చిన్న చిన్న ఉద్యోగులు ఒక్క రూపాయి ఇవ్వకుండా ఈ ఆటో ప్రయాణించవచ్చు. ‘‘కస్టమర్ తృప్తి చెందడమే నాకు ముఖ్యం. కస్టమరే నా దేవుడు’’ అంటాడు అన్నాదురై.
ఈ యువకుడు తన సొమ్ములో అధిక భాగాన్ని చెన్నైలోని వీధిపిల్లల సంక్షేమానికి ఖర్చు చేస్తాడు. గత సంవత్సరం ముగ్గురు పిల్లలను సొంత ఖర్చుతో చదివించాడు. వృద్ధులకు సహాయపడుతుంటాడు. ‘‘మనం ఎవరికైనా మంచి చేస్తే దేవుడు మనకు మంచి చేస్తాడు’’ అని సింపుల్‌గా తన ఫిలాసఫీ గురించి చెబుతున్నాడు అన్నాదురై.
ఈ కుర్రాడు...కారు తయారుచేశాడు!
ప్రతిభ
ఉదయపూర్(రాజస్థాన్)కు చెందిన యువ ఇంజనీర్ అబ్దుల్ ఖదీర్ ఖాన్ శారీరకవైకల్యం ఉన్న వారి కోసం ఒక ప్రత్యేకమైన కారును తయారుచేశాడు. ఈ కారును చాలా సులభంగా ఆపరెట్ చేయవచ్చు. జోధ్‌పూర్‌లో ఎంయిసిఆర్సి ఇంజనీరింగ్ కాలేజీలో మెకానికల్ ఇంజనీరింగ్ చదువుకున్న ఖదీర్‌కు కొత్తగా ఆలోచించడమన్నా, కొత్త వస్తువులు కనిపెట్టడమన్నా చాలా ఇష్టం. ‘‘ఆటో క్లచ్ సిస్టమ్‌ను ఆధారంగా చేసుకొని సులభమైన కంట్రోలింగ్ పవర్ ఉన్న కారును రూపొందించాను. తమ జీవితంలో ఒక్కసారైనా నాలుగు చక్రాల వాహనాన్ని నడపని వారు కూడా దీన్ని నడపవచ్చు’’ అంటున్నాడు ఖదీర్.
పుసుక్కున డౌటు అడిగితే...
క్లాస్రూమ్
ఇంటర్ చదివే రోజుల్లో రమణమూర్తి అనె లెక్చరర్ ఉండేవారు. కెమిస్ట్రీ సబ్జెక్ట్ చాలా బాగా చెప్పేవారు. అయితే ఆయనకు ఒక వింత అలవాటు ఉండేది. పాఠం చెబుతున్నప్పుడు ఎవరైనా ఏదైనా డౌటు అడిగితే...క్లాస్ మొత్తం ఆ డౌటు గురించే చెప్పేవారు.
ఎప్పుడైనా మాకు క్లాస్ బోర్ కొడితే కావాలనే సబ్జెక్ట్‌కు సంబంధం లేని డౌటు అడిగేవాళ్లం.
‘సార్...శంకరాభరణం సినిమా పాటలు రాసిందా వేటూరా? సినారెనా?’’ అని అడిగితే-
‘‘ఇలాంటి డౌట్లు ఇప్పుడా అడగటం?’’ అని విసుక్కుంటూనే ఆ సినిమాలోని పాటల గొప్పదనం గురించి క్లాస్ టైం అయిపోయే వరకు చెబుతూనే ఉండేవారు. ఈ సరదా సంగతి ఎలా ఉన్నా ఆయన పుణ్యమా అని ఎన్నో కొత్త విషయాలు తెలిశాయి.
- బి.విక్రమ్, తాడేపల్లిగూడెం