నిషాంత్ మెరుపు సెంచరీ
జింఖానా, న్యూసైలైన్: పోస్టల్ జట్టు బ్యాట్స్మన్ నిషాంత్ యాదవ్ (119) సెంచరీతో విజృంభించడంతో ఆ జట్టు 170 పరుగుల తేడాతో డెక్కన్ వాండరర్స్ జట్టుపై ఘనవిజయం సాధించింది. హెచ్సీఏ కిషన్ ప్రసాద్ వన్డే నాకౌట్ టోర్నీలో సోమవారం జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పోస్టల్ మూడు వికెట్ల నష్టానికి 306 పరుగులు చేసింది. విజయ్ కుమార్ (49), అజయ్ కుమార్ (35 నాటౌట్) మెరుగ్గా ఆడారు. తర్వాత బరిలోకి దిగిన డెక్కన్ వాండరర్స్ 136 పరుగులకే కుప్పకూలింది. ఇమ్రోస్ (56) మినహా మిగిలిన వారు రాణించలేకపోయారు.
పోస్టల్ బౌలర్లు అజయ్ కుమార్, సురేష్, సూర్యకిరణ్, భార్గవ్ తలా రెండు వికెట్లు తీసుకున్నారు. మరో మ్యాచ్లో షాలీమార్ జట్టు 7 వికెట్ల తేడాతో గ్రీన్టర్ఫ్ జట్టుపై గెలుపొందింది. మొదట గ్రీన్ టర్ఫ్ మూడు వికెట్లు కోల్పోయి 237 పరుగులు చేసింది. అబ్దుల్లా (84 నాటౌట్), అక్షయ్ (68) అర్ధ సెంచరీలతో చెలరేగారు. అనంతరం బ్యాటింగ్ చేసిన షాలీమార్ మూడే వికెట్లు కోల్పోయి 239 పరుగులు చేసి నెగ్గింది. పవన్ కుమార్ (59 నాటౌట్), అలీముద్దీన్ (57 నాటౌట్) అర్ధ సెంచరీలతో రాణించగా... శంతన్ (43), శామ్యూల్ రాజ్ (39) చక్కని ఆట తీరు కనబరిచారు.
ఎ-ఇన్స్టిట్యూషన్ వన్డే లీగ్
వీఎస్టీ: 95 (వాహీద్ 5/20); ఎన్ఎఫ్సీ: 96/5 (రాజు 55; వర్మ 3/26). బీహెచ్ ఈఎల్: 146 (రఫీఖ్ ఖాన్ 35, శ్రీబాబు 45, సతీష్ 31; పన్నాలాల్ 5/23); హెచ్ఏఎల్: 79 (శశి 3/15, శ్రీబాబు 3/3).