పసుపు నాణ్యత లెక్క..2 నిమిషాల్లో పక్కా..
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్
ఆరుగాలం కష్టపడి పండించిన పంట.అందులోనూ పొలాన్ని శ్రద్ధగా, శుచీశుభ్రంగా చూసుకుంటూ పండించే పసుపు పంట. దిగుబడి వచ్చాక మార్కెట్‌కు తీసుకొస్తే.. నాణ్యతపై కొర్రీలు.. ‘కర్క్యుమిన్’ శాతంపై సందేహాలు.. ల్యాబ్‌ల నుంచి రిపోర్టులు రావడానికి నాలుగైదు రోజులు.. వేచి ఉండలేక తక్కువ ధరకు అమ్ముకునే రైతులు..ఇన్నేళ్లుగా కనిపించిన దృశ్యమిది.
మరి ఇప్పుడు..
మార్కెట్లో వెంటనే నాణ్యత పరీక్షలు.. నిమిషాల్లోనే ‘కర్క్యుమిన్’, తేమ శాతం లెక్కలు.. ఆన్లైన్లో పసుపు పంట విక్రయాలు.. రైతులకు మంచి ధరలు.. దీనంతటికీ కారణం ‘కృత్రిమ మేధ (ఏఐ)’తో కూడిన అత్యాధునిక యంత్రాలు.
దేశంలోనే ముఖ్యమైన పసుపు మార్కెట్లలో ఒకటైన నిజామాబాద్ మార్కెట్ యార్డులో ఈ సరికొత్త సాంకేతికత రైతులకు వరంగా మారింది. దేశంలోనే మొదటిసారిగా కేంద్ర సుగంధ ద్రవ్యాల బోర్డు ఇక్కడ ‘కర్క్యుమిన్ రీడింగ్ మెషీన్’ను ఏర్పాటు చేసింది.
రెండేళ్ల కింద మొదలై..
పసుపులో కర్క్యుమిన్ ఆధారిత మార్కెటింగ్ దిశగా దేశంలోనే తొలిసారిగా నిజామాబాద్ మార్కెట్లో పునాది పడింది. రైతుల పసుపు పంటలోని కర్క్యుమిన్ శాతాన్ని స్థానికంగానే, త్వరగా తెలుసుకునేందుకు 2021లో కేంద్ర ప్రభుత్వ సుగంధ ద్రవ్యాల బోర్డు ఇక్కడి మార్కెట్ యార్డులో ‘కర్క్యుమిన్ రీడింగ్ మెషీన్’ను ఏర్పాటు చేసింది. ‘ఏజీ–నెక్ట్స్’ సంస్థ తయారు చేసిన ఈ యంత్రం కృత్రిమ మేధ (ఏఐ) ఆధారంగా పనిచేస్తుంది. ఇంటర్నెట్ ఆధారంగా ‘క్లౌడ్ టెక్నాలజీ’తోనూ అనుసంధానం అవుతుంది.
రైతులు తెచ్చిన పసుపులోని ఒక కొమ్మును పొడిచేసి, ఈ యంత్రంలో పెడితే.. కేవలం రెండు నిమిషాల్లోనే అందులోని కర్క్యుమిన్ శాతాన్ని వెల్లడిస్తుంది. ఇంతకుముందయితే.. పసుపు శాంపిల్‌ను ల్యాబ్‌కు పంపేవారు, ఫలితాలు రావడానికి రెండు, మూడు రోజులు సమయం పట్టేది. ఇక పసుపులో తేమశాతాన్ని గుర్తించే యంత్రాన్ని సైతం గత ఏడాది ఇక్కడి మార్కెట్లో ఏర్పాటు చేశారు. పసుపు కొమ్ములను దంచి ముక్కలను ఇందులో వేస్తే.. కేవలం 5 నిమిషాల్లో తేమ శాతం తెలిసిపోతుంది.
రైతులకు ఉచితంగా..
నిజామాబాద్ మార్కెట్‌కు పసుపు పంట వచ్చే ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లో కర్క్యుమిన్ పరీక్షలు చేస్తున్నారు. ప్రతి శాంపిల్‌కు రూ.140 రుసుము వసూలు చేస్తున్నారు. అయితే మార్కెట్లో పసుపు అమ్మేందుకు వచ్చిన రైతుల నుంచి మాత్రం రుసుము తీసుకోవడం లేదు. వారి పసుపు కర్క్యుమిన్ శాతం ఫలితాలను ‘ఈ–నామ్’ సైట్లో నమోదు చేసి, సంబంధిత పసుపు విక్రయ లాట్‌కు అను సంధానం చేస్తున్నారు.
‘ఈ–నామ్’ సైట్ ద్వారా దేశవ్యాప్తంగా ఏ ప్రాంతంలోని రైతులు అయినా.. ఇక్కడి పంటను కొనుగోలు చేయవచ్చు. దీనివల్ల కర్క్యుమిన్ శాతం ఎక్కువగా ఉన్న పసుపు రైతులకు మంచి ధర లభిస్తోందని అధికారులు తెలిపారు. కర్క్యుమిన్ పరీక్ష యంత్రం, దాని సాఫ్ట్వేర్, నిర్వహణ కలిపి మొత్తం రూ.50 లక్షలు అని వెల్లడించారు. నిజామాబాద్‌లో ఇది విజయవంతం కావడంతో ఇటీవలే మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లోనూ ఏర్పాటు చేశారని చెప్పారు.
ఏమిటీ ‘కర్క్యుమిన్’?
పసుపులో తేమ శాతాన్ని తెలిపే యంత్రం
పసుపులో ఉండే కీలక రసాయన పదార్థమే ‘కర్క్యుమిన్’. దీనితోనే పసుపు పంటకు ఆ రంగు వస్తుంది. ఆహారం నుంచి ఔషధాల దాకా.. రంగుల తయారీ సౌందర్య ఉత్పత్తుల దాకా.. దీని ప్రయోజనాలెన్నో. కర్క్యుమిన్కు యాంటీ బయాటిక్,యాంటీ ఇన్ఫ్లమేషన్ లక్షణాలు ఉంటాయని.. కేన్సర్ సహా ఎన్నో రకాల వ్యాధుల నుంచి రక్షణకు, శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ సమర్థవంతంగా పనిచేయడానికి ఇది తోడ్పడుతుందని శాస్త్రవేత్తలు ఎప్పుడో గుర్తించారు.